అర్హత వయసు తగ్గింపునకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
సిడబ్లూసిలోనూ నిర్ణయం తీసుకోవాలి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్, బిజెపి చీకటి ఒప్పందం
బిసిలకు రిజర్వేషన్లు రాకపోవడానికి ఆ రెండు పార్టీలే కారణం
సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ప్రదానం
మన తెలంగాణ / హైదరాబాద్: దేశంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలంటే అర్హత వయసు 25 ఏళ్లుగా ఉందని, ప్రస్తుతం 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్‌లు తయారై దేశాన్ని నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటప్పుడు 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఓటుహక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. ఓటుహక్కు 21 ఏళ్లు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీకి 25 ఏళ్లుగా ఉందని, ఓటుహక్కు 18 ఏళ్లుగా మారినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 21 ఏళ్లకు పోటీ చేసే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్యేగా 21 ఏళ్లకే పోటీ చేసేలా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ఆమోదింపచేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. సీడబ్ల్యూసీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలోనూ సవరణ అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ మార్పులకు కృషిచేయాలని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్‌ను కోరుతున్నట్లు తెలిపారు.దేశాన్ని నడిపేందుకు యువకులకు అవకాశం ఇవ్వాలని, 21 ఏళ్లకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సల్మాన్ ఖుర్షీద్ బాధ్యత తీసుకోవాలని కోరారు. తమపై పోరాడిన గాంధీని బ్రిటీషర్లు ఏమీ చేయలేకపోయారని, స్వాతంత్య్రం వచ్చాక మతతత్వ వాదులు గాంధీని పొట్టనపెట్టుకున్నారన్నారు. గాంధీని హత్య చేసిన వారు బ్రిటీషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు అని పేర్కొన్నారు.
గాంధీ కుటుంబం స్ఫూర్తినిచ్చింది
సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డును సీఎం రేవంత్‌రెడ్డి ప్రదానం చేశారు. గత 35 ఏళ్లుగా రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర జరుగుతోందని, గాంధీ భారతదేశానికి పర్యాయపదం అని తెలిపారు. భారత్‌లో అన్ని మతాల సహజీవనం స్ఫూర్తినిస్తుందన్న సీఎం గాంధీ కుటుంబం కూడా దేశానికి అదే విధంగా స్ఫూర్తి నిచ్చిందని పేర్కొన్నారు. బ్రిటీషర్లపై పోరాడిన మహాత్మాగాంధీని వారు ఏమీ చేయలేకపోయారని, స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వ వాదులు గాంధీని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. గాంధీని హత్య చేసిన వారు బ్రిటీషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులన్న రేవంత్ దేశ సమగ్రత, సమైక్యత కాపాడడానికి ఇందిరాగాంధీ అసువులు బాసారని గుర్తు చేశారు.
ఇందిరాగాంధీ వారసత్వం, త్యాగాలను రాజీవ్‌గాంధీ పుణికిపుచ్చుకున్నారని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ఎంతో కృషిచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మతసామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటపుడు రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర చేశారన్నారు. దేశ సమగ్రత కాపాడడానికి గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, శాసనసభ్యుడు మదన్ మోహన్,శాసన మండలి సభ్యులు బర్మురి వెంకట్‌తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ లో మనపై కుట్ర జరుగుతోంది: రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్ ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని 22 శాతం బీఆర్‌ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి? ఎవరెవరి మధ్యలో అవగాహన ఉంది? ఎవరు ఎవరిని బలపరుస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే తతంగాన్ని కొనసాగించాలని ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని, బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా కారణం ఈ రెండు పార్టీలేనని ధ్వజమెత్తారు. ఈ కుట్రలన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిద్దామని పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికల్లో చీలిక తీసుకురావాలని కుట్రలు జరుగుతున్నాయని ఈ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ గా మారిందని ఆరోపించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ఎనిమిది స్థానాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని ఆరోపించారు.
సెక్యులరిజానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది: మంత్రి ఉత్తమ్
మతసామరస్యానికి గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేసిందని, సెక్యులరిజానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షోపన్యాసంలో మతసామరస్యానికి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం కట్టుబడి ఉన్న తీరును సోదహారణంగా వివరించారు. సెక్యులరిజం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుందని వివరించారు.
పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రాజీవ్ గాంధీ సద్బావన యాత్ర స్మారోకోత్సవ సభలకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని, నాటి ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా వెనకకు పోకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత బి.సి కమిషన్ చైర్మన్ నిరంజన్ ది అన్నారు. అటువంటి నేతకు రాజ్యాంగ బద్ధమైన పడవి ఇవ్వడం ఆహ్వానించదగిందని చెప్పారు. అలాగే రాజీవ్ గాంధీ సద్బావనా స్మారకోత్సవ పురస్కారానికి కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్శిద్ ను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురైనా అమలు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమన్నారు.
42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకుంటున్నదేవరో చైతన్యవంత మైన సభ్య సమాజం గుర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మత పరంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని, దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సంఘటితంగా మతపరమైన ద్వేషాలకు అతీతంగా పోరాడాలని, మతసామరస్యం కోసం ఇందిర, రాజీవ్ బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. వారు చూపిన దారిలో పయనిస్తూ మతసామరస్యం పాటిస్తూ ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.