సారంగపూర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
పట్టుకునే సమయంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన రియాజ్
మన తెలంగాణ/నిజామాబాద్ క్రైం ః నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని సిసిఎస్ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు రియాజ్‌ను అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రియాజ్‌ను పట్టుకునే సమయం లో ఆసిఫ్ అనే వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నం చేశాడు.
ఈ పెనుగులాటలో ఇద్దరికి గాయలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కి సిసిఎస్ పోలీసులు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో పొడిచి రియాజ్ పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన ప్రమోద్ పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ శాఖ ఐజిని ప్రత్యేకంగా రంగంలోకి దింపింది. ఈమేరకు సిపి సాయిచైతన్య పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా రియాజ్ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో ఓ ఎస్‌ఐ, కానిస్టేబుల్ కలిసి శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిందితుడు రియాజ్ ఉపయోగించిన బైక్ స్థానిక కెనాల్ సమీపంలో లభించడంతో అతను కెనాల్‌లో నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్ల సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు.
అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్ శివారులో ఓ పాత లారీలో దాక్కుని ఉన్నట్లు గుర్తించి పట్టుకునే సమయంలో పరారయ్యాడు. అక్కడే ఉన్న నెహ్రూనగరానికి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తిపై దాడి చేశాడు. ఈ మేరకు అతని చేతి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడు రియాజ్‌ను పట్టుకున్నారు. చికిత్స నిమిత్తం వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.