భూ సమస్యలకు శాశ్వత పరిష్కార బాధ్యత మీదే
ధరణి చట్టమే బిఆర్‌ఎస్ పతనానికి ప్రధాన కారణం
త్వరలో గ్రూప్3, గ్రూప్4 నియామకాలు పూర్తి
సిఎం లైసెన్స్‌డ్ సర్వేయర్లకు దీపావళి కానుక: మంత్రి పొంగులేటి
మన తెలంగాణ / హైదరాబాద్ : దశాబ్దాల తరబడి తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ రైతాంగానికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకను అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం శిల్ప కళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై శిక్షణ పొందిన సర్వేయర్ లైసెన్స్‌లు పంపిణీ చేసిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి ప్రసంగించారు.
గత ప్రభుత్వం ధరణి పేరిట చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్కేద కార్యక్రమం చేపట్టిందని, దీనిలో భాగంగా 3,456 మందికి లైసెన్స్‌లు మంజూరు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూలో భాగమైన సర్వే వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆలోచించి దరఖాస్తులను ఆహ్వానించామని చెప్పారు.
దీనికి బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన పదివేల మంది దరఖాస్తు చేసుకోగా ఏడువేల మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 3,456 మంది క్షేత్ర స్థాయిలో తర్ఫీదు పొంది ఎంపికయ్యారని, వీరికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్స్‌లు అందించామన్నారు. నాడు జిపిఓ వ్యవస్థ, భూ భారతి, సాదా బైనామా తదితరాల విషయంలో అలక్షం జరిగినందున సుమారు 9.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని తమ ప్రజా ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తోందన్నారు. చిన్న అవకతవకలు జరుగకుండా, ప్రజలకు వ్యతిరేకంగా పని చేయకుండా ప్రజా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి పొంగులేటి సర్వేయర్లను కోరారు. లైసెన్స్‌లు పొంది సంతోషించినట్లే ప్రజలను కూడా మీ పనులతో సంతోషపడేలా చేయాలని, ప్రభుత్వానికి పేరు తేవాలని కోరుతూ లైసెన్స్‌డ్ సర్వేయర్లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.