అయ్యో, సావిత్రి అలా అయిపోయింది. హరనాథ్ ఎందుకూ కొరగాకుండా పోయాడు. కాంతారావుకి సొంత ఇల్లు కూడా లేదు తెలుసా? రావు బాల సరస్వతి ఏ ఆస్తి లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది.. ఇలా మాట్లాడుకోవడం మనకి చాలా ఇష్టం. ఇదొక శాపం మనకి. రావు బాల సరస్వతి అనే పాటలు పాడే యువతి బతికినంత కాలం, మామూలు కాలం కాదది. మూల నారాయణస్వామి, హెచ్.ఎం.రెడ్డి, కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, ఎల్‌వి.ప్రసాద్ ప్రయోగాలు చేస్తున్న కాలం. ఎన్‌టి.రామారావు, ఎస్‌వి.రంగారావు, రేలంగి, నాగయ్య, జగ్గయ్య, అక్కినేని లాంటి వాళ్లు పాండీ బజార్‌లో, సిగరెట్లు కాలుస్తూ తిరుగుతున్న కాలం. మహాకవులు అక్కడే టీలు తాగుతున్న మహత్తరమైన కాలం. విజయ, వాహిని స్టూడియో లు దక్షిణ భారత చలనచిత్ర రాజధాని నగరం మద్రాసుకి భుజకీర్తులై వెలుగుందుతున్న రోజులవి.
అదిగో మల్లాది రామకృష్ణ శాస్త్రి, అక్కడే మార్కస్ బారట్లే, ఆ చెట్టు కింద పింగళి నాగేంద్ర రావు ఆ పక్కన, వేదాంతం రాఘవయ్య, ఇడ్లీ సాంబార్ కోసం నడిచి వెళుతున్న ఘంటసాల, అదిగో అక్కడే కూని రాగాలు తీస్తున్న సాక్షాత్తూ సుసర్ల దక్షిణామూర్తి, హార్మోనియం మెట్లు సరిచూసుకుంటూ ఎస్.రాజేశ్వరరావును పలకరిస్తూ వస్తున్న సావిత్రి, సిగ్గుపడుతూ నిల్చున్న జమున, ‘టైం అయింది పదండి’ అంటూ భానుమతి, ‘పులిహోర తిని వెళ్దాం రండర్రా’ సూర్యకాంతం.. ఇలా కొన్ని వందల పేర్లు రాయొచ్చు. అది మరపురాని, మరువలేని తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ స్వర్ణ యుగం. ఆ అమాయకమైన చల్లని వెన్నెల రోజుల్లో పి.లీల, ఈశ్వర్‌లక్ష్మి, జిక్కి, జమునా రాణి, సుశీల, భానుమతులతో కలిసి నడిచింది బాల సరస్వ తి. గొంతు కలిపి పాడింది గాన సరస్వతి.
ఆమె ఏనాటిదంటే 1936లో సతీ అనసూయ కోసం బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన ‘ఏది దారి నా కిచ టా, ఈ కలుష భూతముల పాలైతివి’ పాట పాడిన అతి పురాతన గాయని. మల్లాది రామకృష్ణ శాస్త్రి, సీ, జూ.సముద్రాల, తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, ఆత్రేయ, అనిశెట్టి, ఆరుద్ర, సదాశివ బ్రహ్మం, బసవరాజు అ ప్పారావు లాంటి కవులు రాసిన పా టలు పాడిన అదృష్టవంతురాలు. రజనీకాంతరావు రాసిన ‘ఓ మల య పవనమా, నిలు, నిలుమా, ఓ విరిసిన దిరిసెన పువ్వా?’ పాట విన్నారా.. ఎంత హొయలు పోయిందో ఆ బాల గొంతులో! ఎమ్మెస్ రామారావుతో కలిసి మరి పాడింది.
‘వద్దంటే డబ్బు’లో కృష్ణశాస్త్రి పాట ‘ఎందుకో ఈ హాయి నాకు? ఎందుకమ్మా బిడియమూ? ఎదురుచూసే కనులలోనే నిలిచనే నా ప్రాణము, తాను వచ్చె వేళలోనే నా ధైర్యమంతా జారినే..’ ఆమె గొంతులో వినితీరాలి. మనకి బాగా తెలిసిన దేవదాసు దాకా ఎన్ని మధుర గీతాలో! లెక్కలేనన్ని లలిత గీతాలు పాడింది. వింజమూరు శివరామారావు, ఎస్.వి.భుజంగరాయ శర్మ, దాశరథి, తోలే టి, కొనకళ్ళ వెంకటరత్నం, గిడుగు రాజేశ్వరరావు పాటలు ఆ తేనె గొంతులో ప్రాణం పోసుకున్నాయి. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి లలిత గీతం, ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి వ్యష్టి జీవమున చేదు పానీయమోయి, కలువరాణిని విడిచి చలువరేడే లేడు, సోలు పూలను విడడు, గాలి రాజే రోజు’.. ఈ కల్తీలేని కవిత్వం ఆమె గొంతులోనే పలకాలి మరి! ముసిరిందంటే.. అని మొదలయ్యే కొనకళ్ళ వెంకటరత్నం పాటని తలుచుకుందాం. ‘మబ్బు తెరల మసకలలోన, మంచు పొగల మెలికలలోన మనసెటో చిక్కడినట్లే, మనేద కుదిపేస్తది లోన’ అని ఘంటసాలతో బాల కలిసి పాడుతూ ఉంటే.. ఓహ్.. కొనకళ్ళ ధన్యుడు అయ్యాడు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి కలంలో వెన్నెల నింపి రాసిన ఓ గీతం ‘రెల్లు పూల పానుపు పైన, జల్లు జల్లుగా ఎవరో, చల్లినారమ్మా, వెన్నెల చలినారమ్మ’.. అసలే మహాకవి, ఆపైన మధుర గాయని. ఇలాంటి కొన్ని వేల పాటలు మనకి కానుకగా ఇచ్చిన ప్యూ ర్ ఆర్టిస్ట్ రావు బాల సరస్వతీ దేవి. సౌందర్యరాశి, 16, 17ఏళ్ల వయసులోనే రెండు మూడు సినిమా ల్లో హీరోయిన్‌గా నటించింది. ముఖ్యమంత్రులు ఎన్‌టి.రామారావు, జయలలిత నుండి గౌరవం, బహుమతులు పొందింది. ‘వినండి, పాడుకోండి’ అని లెక్కనేనన్ని మధుర గీతాలను మనకి అంకి తం ఇచ్చి వెండి మబ్బుల మీద నుంచి హుందాగా నడిచి వెళ్ళిపోయింది ఆ వెన్నెల పాట.
తాడి ప్రకాష్