ఒకప్పుడు అనుకున్నాం అన్ని మన ఆధీనంలో ఉంటాయని
మన రోజులు, మన పిల్లలు, మన వ్యాపకాలు
చివరకి మన జీవితం నడిచే తీరు కూడా
అందుకే, జీవితాన్ని ప్లాన్ చేసుకుని మన కలల్ని
ఆశయాల్ని, జీవన గమ్యాన్ని, చివరకి
మన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా
గట్టిగా వాటేసుకున్నాం
బహుశా అప్పుడు అట్లా ఉండడం అవసరమేమో..
ఆ దశలో, జీవితం మనని అడిగి ఉంటుంది
పునాదులు వెయ్యమని, సంరక్షణ చెయ్యమని
ఆత్మీయత పంచమని
మార్గదర్శకులుగా నిలవమని
కానీ, నెమ్మదిగా జీవితం మారిపోతుంది
ఎంతో అపురూపంగా, జాగ్రతగా మలుచుకుని
మనసుకు దగ్గరగా పెట్టీ ఉంచుకున్నవన్నీ
ఒక్కొక్కటిగా జారిపోతాయి.
అట్లా జారిపోవడం బాధ కలిగించదు కానీ..
హుందాగానే, అప్రయత్నంగా అన్నీ జారవిడుస్తాం
పిల్లలు ఎదిగి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు
మన మీద ప్రేమ లేక కాదు
వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మలుచుకోడానికి
ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు
అమ్ముడుపోతుంది
ఆ ఇంటి మీద ఇష్టం లేక కాదు
ఆ మెట్లు ఎక్కే శక్తి లేక
ఇంటి పెద్దగా తల్లిగా, తండ్రిగా
దారి చూపే మార్గదర్శకులుగా
జీవితాల్ని మలచిన మన బాధ్యత కూడా
మరుగున పడిపోతుంది
తడి ఇసకలో రాసిన పేరులా
అప్పుడు, అలాంటప్పుడు
బహుశా నిశ్శబ్దం నిండిన ఓ మధ్యాహ్నం
హఠాత్తుగా తడుతుంది మనసుకి
జీవితం మారిపోయిందని
మనం రోజా పలకరించుకున్న మనుషులు
ఇప్పుడు ఫోన్‌లో సందేశాలకే
పరిమితం అయిపోయారని
మన చుట్టూ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయని
చివరకి, మన ముఖాల్లో మునుపు లేని ముడతలు
రూపుదిద్దుకుంటున్నాయని
అదిగో అప్పుడే దుఃఖం, బాధ కన్నా మనలో
మరేదో నెలకొంటుంది
అదే, ఒకలాంటి ప్రశాంతత
నెమ్మదిగా అర్ధం అవుతుంది
గతాన్ని వదిలేయడం అంటే
ఏదో పోగొట్టుకోవడం కాదని
నిశ్చలతకి, ప్రశాంతతకి, విశ్లేషణకి
సమయం వచ్చిందని
గతాన్ని వదిలేయడం అంటే
మనసుల్లోని జ్ఞాపకాల్ని
బంధాలు లేకుండా పదిలం చేసుకోడం అని
గతాన్ని వదిలేయడం అంటే ప్రపంచం
మన చుట్టూ పరిభ్రమించదు కానీ
మనం కూడా అందులో ఒక అందమైన భాగం అని
గతాన్ని వదిలేయడం అంటే బలహీనత కాదని
ఎదురైన రాళ్ళు రప్పలతో పోరాడకుండా
వాటి చుట్టూ నాట్యం చేస్తూ
ఆనందంగా, అందంగా సాగిపోయే
నది లాంటి హుందాతనం అని
అదిగో అప్పుడే
మన ప్రపంచం స్తబ్దుగా మారినప్పుడు
మారిన ప్రపంచాన్ని అంగీకరించే
మనస్థైర్యం అలవడుతుంది
బంధాలు తగ్గిపోతాయి కానీ
మనసు నిండుగా ఉంటుంది
తాపత్రయాలు తగ్గిపోతాయి కానీ
ఉన్నదాంట్లోనే తృప్తి ఉంటుంది
మాటలు తగ్గుతాయి కానీ
మాటల్లో లోతు, అర్ధం ఉంటుంది
అదిగో అప్పుడే, కిటికీ పక్కన కూచుని
టీ తాగుతున్నప్పుడు మన పెదాల మీద
చిరునవ్వు వెలుగుతుంది
జీవితం మనం అనుకున్నట్టే
సాగిందని కాదు కానీ..
మనం జీవించాం, మనం ప్రేమించాం
మనం త్యజించాం
అన్నీ హుందాగా అని
సుషమ దండమూడి