మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణు గోపాల్ , ఆశన్నలు వంటి నేతల వ్యవహారాన్ని ప్రత్యేకంగా గుర్తించి, వారిని విప్లవ ద్రోహులుగా పేర్కొంది. శత్రువుల ఎదుట లొంగిపోయి పార్టీ నష్టానికి కారణమైన నేతలకు తగిన శిక్ష ప్రజలే విధిస్తారని మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది.
పార్టీ కేంద్ర కమిటీతో చర్చించకుం డానే వారిద్దరు లొంగిపోయారని ఆరోపించింది. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ప్రాణభీతి ఉన్నవారెవరైనా లొంగిపోవచ్చ ని.. కానీ ఆయుధాలు మాత్రం అప్పగించకూడదని కోరింది. గత కొన్ని రోజులుగా కీలక మావోయిస్టు నేతలు లొంగిపోతున్నారు. కాగా 2 రోజుల్లో 258 మంది లొంగిపోయారని అమిత్ షా ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ లేఖ కలకలం సృష్టిస్తోంది. ‘2011 చివరి నుంచి విప్లవోద్యంమం గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వస్తోంది. 2018లో మవోయిస్టు పార్టీ ఒకసారి తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి.
2020 కేంద్ర కమిటీ సమావేశంలో.. మల్లోజుల దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై సొంత విశ్లేషణలతో నిర్థారించి ఒక పత్రాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడూ జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో ఆయన తప్పుడు రాజకీయ భావనలను పార్టీ విమర్శించింది. అనంతరం ఆయనను పార్టీ సరిదిద్దడానికి కృషి చేసింది. 2011లో జరిగిన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్లీనం మల్లోజుల వ్యక్తివాదాన్ని, అహంభావాన్ని, తీవ్రమైన పెత్తందారీతనాన్ని విమర్శించి, వాటిని సరిదిద్దుకోవాలని కోరిం ది.
అయితే, 2025 మే నెలలో జరిగిన ఆపరేషన్ కగార్ దాడిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత మల్లో జులలో దీర్ఘకాలంగా ఉన్న సైద్దాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరి ల్లేలా చేశాయి‘ అని అభయ్ లేఖలో పేర్కొన్నారు. ‘విప్లవానికి ద్రోహులుగా మారిన మల్లోజుల, ఆశన్నల ముఠా సరైన మార్గంలో విప్లవ ఉద్యమాన్ని పునర్మిస్తామనడం బూటకం. వాళ్లు కేంద్ర, రాష్ట్ర ఇంటజిజెన్స్ ఏజెన్సీల నియంత్రణలో ఉంటూ చేసే ప్రజా పోరాటాలు, నిర్మించే విప్లవ ఉద్య మం, ప్రభుత్వ ప్రాయోజిత ప్రజా పోరాటాలుగా, విప్లవ ఉద్యమంగానే ఉంటాయి. అందుకే ఈ విప్లవ ద్రోహులు ప్రజాపోరాటాల పేరుతో ప్రజల వద్దకు వస్తే వారిని తన్ని తరమాల్సిందిగా పిలుపు నిస్తున్నాం. కగార్ యుద్ధంతో ప్రాణభీతి ఉన్నవారు ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ.. పార్టీకి, విప్లవ ప్రజలను చెందిన ఆయుధాలను శత్రువుకు అప్పగించకూడదని కోరుతున్నాం. అది విప్లవ ద్రోహమే కాకుండా విప్లవ ప్రతి ఘాతకత అవుతుంది. విప్లవ ప్రతిఘాతకులను విప్లవ ప్రజలు శిక్షించక తప్పదు‘ అని లేఖలో అభయ్ హెచ్చరించారు.
‘విప్లవోద్యమంలో వెనకంజలు, ఓటములు తాత్కాలికమే’
’భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు- మన రాజకీయ కార్యక్రమం’, ’భారతదేశంలో కులసమస్య మన దృక్పథం’, ’భారతదేశంలో బాతుల సమస్య- మన పార్టీ వైఖరి’, ’భారతదేశంలో దళారీ నిరంకుశ బూర్జువా వర్గం పై పార్టీ వైఖరి -రాజకీయ కార్యక్రమం’ డాక్యుమెంట్లను మరింతగా సంశ్లేషించి మారిన సామాజిక పరిస్థితులకు, మారుతున్న విప్లవయుద్ద స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ- సైనిక పంథా మరింతగా సంపన్నం చేసుకుని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్తు దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. విప్లవోద్యమంలో వెనకంజలు, ఓటములు తాత్కాలికమే సోను, సతీష్ ముఠా ద్వారా సృష్టించబడ్డ ఈ స్థితిని పార్టీలో ఏర్పడిన సంక్షోభంగా గుర్తించి, ఈ సంక్షో భాన్ని అధిగమిద్దాం. ప్రస్తుతం మన స్వీయాత్మక శక్తులు నష్టపోయి, బలహీనపడ్డ స్థితిని అంగీకరిస్తూ, మన విప్లవోద్యమంపై శత్రువు.అధికృత సంపాదించిన స్థితిని గమనంలో ఉంచుకుని పార్టీని, పీ.ఎల్.జె.ఎ.ను, ఐక్య సంఘటనను మొత్తంగా విప్లవోద్యమాన్ని కాపాడుకుంటూ దేశవ్యాప్త విప్లవోద్యను పునర్నిర్మాణానికి పూనుకుందాం. సోను, సతీష్‌లు శత్రువుకు సరెండరయినా రేపు మరొకరు సరెండరైనా మన పార్టీ శత్రువుకు సరెండర్ కాదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం. వర్గాలున్నంతకాలం వర్గ పోరాటాలు వాటి ఉన్నత రూపాలుగా ప్రజాయుద్దాలు కొనసాగడం తిరుగులేని చారిత్రక నియమం. ఈ నియమాన్ని లొంగుబాట్లు మార్చలేవు. కాబట్టి తాత్కాలిక వెనకంజలో సైతం విప్లవోద్యము పురోగమనం కోసం కృషి చేయడానికి గొప్ప ఆత్మవిశ్వాసంతో, ధైర్యసాహసాలతో ముందుకుసాగుదాం అంతిమ విజయం ప్రజలదే’ అని అభయ్ పేర్కొన్నారు.