కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి ఫైరయ్యారు. ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో బుల్డోజర్ రాజ్యం వచ్చిందని.. రాష్ట్రంలో పాలనపరమైన వైఫల్యం కొనసాగుతున్నదని విమర్శించారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావ్సాలిందేనని.. తెలంగాణ మళ్లీ పట్టాలు ఎక్కాల్సిందేనని కెటిఆర్ పేర్కొన్నారు. ఇంతకు ముందు లెక్క ఉండదని.. అందరి లెక్కలు తేలస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్క పెద్ద వ్యక్తి ఇల్లు అయినా కూలగొట్టారా…? అని నిలదీశారు. మూసీకి అడ్డంగా కడుతున్నవారిని ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. బడా నేతల ఇళ్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదని, పేదల వద్ద నివాస పత్రాలు ఉన్నా రాత్రికి రాత్రే కూలుస్తున్నారని ఆరోపించారు. పెద్దల ఇళ్ల చిరునామాలు హైడ్రాకు తెలియదు అని, పేదల ఇళ్లు కూలిస్తే అడిగేవారు లేరని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్య పరిపాలన అని పేర్కొన్నారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం చేపట్టకుండా కేవలం ప్రచారం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. బిసి రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను పూర్తిగా మోసం చేసిందని అన్నారు. ఎలాంటి హోంవర్క్ లేకుండా రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని, చివరికి కాంగ్రెస్ పార్టీ మోసాన్ని కోర్టు ఎండగట్టిందని పేర్కొన్నారు. నిజంగానే బిసి రిజర్వేషన్లపైన కాంగ్రెస్ పార్టీకి, బిజెపి పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, వారి ఎంపీలు తెలంగాణ గల్లీలో దొంగ పోరాటం చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంటులో బిసి బిల్లు పెట్టేలా ప్రయత్నం చేయాలని సవాలు విసిరారు.
చేయాల్సిన చోట పని చేయకుండా బిసిలను మోసం చేసే ఏకైక ఉద్దేశంతోనే కాంగ్రెస్, బిజెపి పార్టీలు తెలంగాణలో నాటకాలు ఆడుతున్నాయని కెటిఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా రెండు జాతీయ పార్టీలు బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు. తమకు ఉన్న రాజ్యసభ ఎంపీల ద్వారా పార్లమెంటులో పూర్తి మద్దతు అందిస్తామని అన్నారు.