గత ఏడాది దీపావళికి ‘క’ మూవీతో పెద్ద హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి కూడా ఈ పండగకు ‘కె ర్యాంప్’ సిని మాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు జైన్స్ నాని రూపొందించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు. ఈ చిత్రం శనివారం థియేటర్లలో విడుదలైంది. అయితే హీరో కిరణ్‌కు ఈ దీపావళి కూడా విజయాన్నందించిందా? లేదా? తెలుసు కుందాం పదండి.
కథ: కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) తండ్రి బాగా డబ్బున్న వాడు. చిన్నప్పటి నుంచి అతడికి చదువు మీద ధ్యాస ఉండదు. ఎప్పుడూ తాగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. తన దగ్గర ఉంటే కొడుకు బాగుపడట్లేదని.. కుమార్‌ను కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డొనేషన్ కట్టి చేర్పిస్తాడు అతడి తండ్రి. అక్కడికి వెళ్లాక కూడా కుమార్‌లో ఏ మార్పూ ఉండదు. అక్కడే అతడికి మెర్సీ (యుక్తి తరేజా) పరిచయం అవుతుంది. ఆమె చేసిన సాయానికి ఆనందపడి తనతో ప్రేమలో పడిపోతాడు కుమార్. నెమ్మదిగా మెర్సీ కూడా అతడిని ప్రేమిస్తుంది. తాను కోరుకున్న అమ్మాయి ప్రేమించిందని కుమార్ సంబరపడుతుంటే.. మెర్సీకి ఉన్న ఓ సమస్య గురించి అతడికి తెలుస్తుంది. అక్కడి నుంచి కుమార్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ మెర్సీ సమస్యేంటి? దాని వల్ల కుమార్ పడ్డ ఇబ్బందులేంటి? ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ: ‘కెర్యాంప్’ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం పలు సన్నివేశాల్లో మందు తాగుతూ కనిపిస్తుంటాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో హీరో తాగుతుంటాడు. హీరోయిన్ పరిచయ సన్నివేశంలో కూడా హీరో తాగుతూనే కనిపిస్తాడు. సినిమాలో తొలి పాటకు ముందు కూడా అదే పని చేస్తుంటాడు. ఫైట్ సీన్‌లో కూడా హీరోకు తాగితే కానీ కొట్టేంత బలం రాదు. సినిమాలో కథ కీలక మలుపు తిరిగే సీన్లో కూడా హీరో మందుకొట్టి కింద పడిపోయి ఉంటాడు. ఇలా సినిమాలో యువతకు హీరోను కనెక్ట్ చేయడానికి ‘మందు’ను మించిన మార్గం లేదని అనుకున్నారేమో తెలియదు మరి. హీరో పాత్రను ఇలా పరిచయం చేసి.. సిల్లీగా సీన్లు నడిపిస్తుంటే ఇక సినిమా మీద ఏం ఆశలు ఉంటాయి? కిరణ్ అబ్బవరం ‘క’కు ముందున్న ఫాంలోకే వెళ్లిపోతున్నాడనే అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కాలేజీ, ప్రేమాయణం, హీరోయిన్ సమస్యను తెలియ చేయడంతో సాదాసీదాగా సాగింది.
ప్రధాన పాత్రలకు ఏదో ఒక డిజార్డర్ పెట్టి కామెడీ పండించడంలో దర్శకుడు మారుతి దిట్ట. భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు చిత్రాల్లో అతను ఇలాగే ప్రేక్షకుల మనసులు గెలిచాడు. వేరే దర్శకులు కూడా అతడిని అనుసరించారు. కానీ ఒక దశలో ఆ కథలన్నీ ఒకేలా అనిపించడంతో వాటిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. కానీ కొంచెం గ్యాప్ తర్వాత కొత్త దర్శకుడు జైన్స్ నాని.. తన డెబ్యూ మూవీకి ఈ ఫార్ములానే ఎంచుకున్నాడు. చెప్పిన మాట మీద నిలబడకపోయినా.. టైం తప్పినా.. వెర్రెత్తి ప్రవర్తించే హీరోయిన్ పాత్ర చుట్టూ సీన్లు రాసుకున్నాడు. ఈ పాత్ర కొత్తగా అనిపించకపోగా కొన్ని చోట్ల బోర్ కొట్టించింది. చివరలో కథకు ఇచ్చిన ఎమోషనల్ టచ్ అంతగా కుదరక సినిమా నిరాశ కలిగిస్తుంది.
ఇక సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య అన్ని ముద్దు సీన్స్ యూత్ కోసమే తీశారనిపిస్తుంది. ఇక జీవితంలో ఓ లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడి పాత్రలో కిరణ్ అబ్బవరం పర్వాలేదనిపించాడు. మెర్సీ జాన్ పాత్రలో యుక్తి తరేజా గ్లామర్ కోసమే నటించినట్లుంది. హీరోకి తండ్రిగా, వ్యాపారవేత్తగా సాయి కుమార్, వెన్నెల కిశోర్, అలీ, శ్రీనివాసరెడ్డి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’తో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరపురాని ఆడియో ఇచ్చిన చేతన్ భరద్వాజ్.. ఈసారి యావరేజ్ పాటలే ఇచ్చాడు. రవీంద్ర రాజా మాటలు కొన్నిచోట్ల ఓకే అనిపించినా చాలా చోట్ల డైలాగ్స్ హద్దులు దాటిపోయాయి. దర్శకుడు జైన్స్ నాని ‘కె ర్యాంప్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.