మన తెలంగాణ/హైదరాబాద్: ఏ4 మద్యం దు కాణాల కోసం ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తుదారులు శనివారం బారులుతీరారు. ముఖ్యంగా ఏపికి చెందిన మహిళలు దరఖాస్తు చే సుకోవడానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన (సోన్ డి కులానికి) చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా, ఇందుకోసం ఆమె రూ.4కోట్ల 50లక్షలు చెల్లించింది. ఎపికి చెందిన (సోన్ డి కులానికి) మహిళ లు ఈ దరఖాస్తుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తమ కులానికి ఎపిలో రిజర్వేషన్ ఉందని, తెలంగాణలో కూడా (సోన్ డి కులానికి) రిజర్వేషన్‌లు కల్పించాలని వారు డిమాండ్ చేశా రు. అందులో భాగంగా తాము కూడా తెలంగాణ లో ఏ4 మద్యం షాపులను ఏర్పాటు చేయడానికి ఈ దరఖాస్తులను దాఖలు చేశామని వారు తెలిపారు. అయితే, వారు డిమాండ్ చేసినట్టుగా ఎపికి చెందిన ఆ కులానికి ఇక్కడ రిజర్వేషన్‌లు వర్తించవని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన గౌడ్, ఎస్టీ, ఎస్సీలకే ఏ4 మద్యం షాపుల్లో రిజర్వేషన్‌లు వర్తిస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
శనివారం ఒక్కరోజే సుమారుగా 30వేల దరఖాస్తులు!
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు శనివారం వరకు 80 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్కరోజే సుమారుగా 30వేల దరఖాస్తులు వచ్చినట్టుగా ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించేందుకు ఆబ్కారీ శాఖ సెప్టెంబర్ 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా శుక్రవారం వరకు మందకొడిగా దరఖాస్తుల పర్వం కొనసాగింది. శుక్రవారం ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు రాగా, శుక్రవారం సాయంత్రం వరకు 50వేల దరఖాస్తులు ఆబ్కారీ శాఖకు వచ్చాయి. శుక్రవారం వరకు 50 వేల దరఖాస్తులు రాగా శనివారం మరో 30 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి.
ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున నాన్ రిఫండెబుల్ ఫీజును ఎక్సైజ్ శాఖ వసూలు చేస్తోంది. శనివారం నాటికి 80 వేల దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.2,400 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈనెల 23న మద్యం దుకాణాలకు డ్రా తీయను న్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మద్యం టెండర్లకు లక్షా 32 వేల దరఖాస్తులు రాగా వాటి ద్వారా 2,645 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో అప్పట్లో భారీగా దరఖాస్తులు వచ్చాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఓ మద్యం దుకాణానికి ఒకటే దరఖాస్తు
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని ఒక మద్యం దుకాణానికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్టుగా తెలిసింది. రిజర్వుడ్ దుకాణాలకు గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గినట్టుగా సమాచారం. వ్యాపారులు సిండికేట్లుగా మారి తక్కువగా దరఖాస్తులు వేశారన్న ఆరోపణలు పలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. దరఖాస్తుల ఫీజు ఎక్కువగా ఉండడంతో మద్యం వ్యాపారులు ఈసారి ఆచితూచి వ్యవహారిస్తున్నట్టుగా తెలిసింది. సిండికేట్‌లుగా మారి దరఖాస్తులను తక్కువగా వేసినట్టుగా తెలిసింది.