వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే ఇప్పుడున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉనికిలో ఉండకపోవచ్చునని సౌత్ ఆసియా మాస్టర్ కార్డు ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సిఇఒ) గౌతమ్ అగర్వాల్ తెలిపారు. ఓ మోస్తరు ఆదాయ వర్గాలు, ఉద్యోగస్తులు, ప్రత్యేకించి యువ ఐటి ఉద్యోగులు విరివిగా ఈ క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియ అత్యధికంగా డిజిటల్ రూపంలో ఉంటుంది. కార్డుల రూపంలో చెల్లింపుల దశ ఉండదేమో, మన ఆలోచనలకు అనుగుణంగా తక్షణ చెల్లింపుల క్రమంలో ఇకపై ఇప్పటి క్రెడిట్ కార్డుల చెల్లింపుల దశ మారుతుందని న్యూఢిల్లీలో జరుగుతోన్న ఎన్‌డిటీవీ సమ్మిట్ 2025లో ఆర్థిక లావాదేవీల విషయాల విశ్లేషణ దశలో అగర్వాల్ చెప్పారు. భారతదేశంలో ఆర్థిక వ్యవహారాలు, ప్రత్యేకించి చెల్లింపుల ప్రక్రియలో అత్యంత వేగవంతంగా మార్పులు ఉంటున్నాయి.
ఇంతకు ముందు రూపాయల్లో చెల్లింపులు ఉండేవి. వీటి స్థానంలో క్రమేపీ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదంతా కూడా మానసిక చైతన్యస్రవంతికి సంబంధించిన వ్యవహారం కానుంది. ఈ క్రమంలో చెల్లింపుల విషయంలో మార్పులు అనూహ్యం అన్నారు. మొత్తం మీద భారత్ ప్రపంచంలోనే అత్యధిక అధునాతన చెల్లింపుల వ్యవస్థగా నిలిచింది. ఇందులో సందేహం లేదు. విస్తరిస్తున్న డిజిటల్ ప్రక్రియ, ఇందులో ఇమిడి ఉంటోన్న అత్యంత తేలికైన లావాదేవీల వ్యవహారాలతో జనం ప్రత్యేకించి భవిష్య తీరుతెన్నుల వైపు మొగ్గుచూపే వారు క్రెడిట్ కార్డులు , లేదా డెబిట్ కార్డుల దారిని వీడుతారని అగర్వాల్ విశ్లేషించారు. పైగా క్రెడిట్ కార్డుల చెల్లింపుల క్రమంలో తలెత్తే తాత్కాలిక ప్రయోజనంతో పోలిస్తే ఆ తరువాత తలెత్తే ఆర్థికపరమైన చిక్కులు, పొందిన దాని కంటే ఎక్కువ చెల్లింపుల స్థాయిలో భారం వంటి అనుభవాలతో జనం పాత బాట వీడి వేరే రూపంలో చెల్లింపులకు దిగే వీలుందని విశ్లేషించారు.