ప్రభుత్వ వైద్యుల నిర్లక్షంతో గర్భిణి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..లింగంపల్లి గ్రామానికి చెందిన పంతంగి మానస (25) 7 నెలల గర్భిణి. శుక్రవారం ఆమె ఐరన్ ఇంజక్షన్ కోసం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్షంతో ఎలాంటి టెస్టులు చేయకుండానే వైద్యులు ఐరన్ ఇంజక్షన్ ఇవ్వడంతోనే మానస మృతి చెందిందని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు, గ్రామస్థులు మంచాల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ముందు బైఠాయించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు పార్టీల నాయకులు, బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.