గడిచిన కొద్దికాలంలోనే టీం ఇండియాలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్ట్ క్రికెట్‌కి రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో అతడి స్థానంలో శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంగ్లండ్ సిరీస్ రూపంలో గిల్‌కు పెద్ద సవాలే ఎదురైంది. అయితే ఆ ప్రతిష్టాత్మక సిరీస్‌ని గిల్ 2-2 తేడాతో సమం చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి.. ఆ బాధ్యతలు కూడా గిల్‌కే అప్పగించింది బిసిసిఐ. మరి ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి.
అయితే అంతకు ముందే గతేడాది టి-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టి-20 ఫార్మాట్‌కి రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో అతడి స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ భర్తీ చేశాడు. అయితే తాజాగా మూడు ఫార్మాట్‌లకు ఒకరే కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంకేతాలు ఇచ్చారు. దీనిపై సూర్య తాజాగా స్పందించాడు. ‘‘గిల్ రెండు ఫార్మాట్‌లకు కెప్టెన్ కావడం సంతోషంగా ఉంది. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, టి-20 కెప్టెన్సీ విషయంలో నేను అబద్ధం చెప్పను. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కెప్టెన్సీ చేజారుతుందనే భయం ఉంటుంది. అయితే, ఆ భయం నుంచే నన్ను నేను మరింత మెరుగుపరచుకోవాలనే ప్రేరణ కూడా వస్తుంది. మైదానం లోపల, వెలుపల గిల్‌తో నా రిలేషన్ అత్యద్భుతంగా ఉంది. సోదర భావంతో మెలుగుతాం’’ అని సూర్య అన్నాడు. కాగా, అక్టోబర్ 19 భారత్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆక్టోబర్ 29 నుంచి టి-20 సిరీస్‌లో తలపడనుంది.