హైదరాబాద్: సిఎస్, సిఎంవొ కార్యదర్శులతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారుల పని తీరులో ఇంకా మార్పు రాలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. కొందరు అధికారు పని తీరులో ఇంకా మార్పు రావట్లేదని పేర్కొన్నారు. అధికారులు అలసత్వం వీడి పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని తెలిపారు.
అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తేనే పనులు వేగవంతం అవుతాయని సిఎం స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని.. కీలక దస్త్రాలు, పనులు ఎక్కడా ఆగిపోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు రాబట్టుకునే కార్యచరణను వెంటనే చేపట్టాలని.. ఇకపై సిఎస్, సిఎంవొ అధికారులు ప్రతివారం నివేదికలు అందించాలని ఆదేశించారు.