ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీం ఇండియా ఎంపిక మరో వివాదానికి తెరలేపింది. ఈ సిరీస్‌కు జట్టు ఎంపిక విషయంలో టీం ఇండియా పేసర్ షమీకి.. చీఫ్ సెలక్టర్ అగార్కర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. షమీ ఫిట్‌నెస్ గురించి తమ వద్ద సమాచారం లేదని మీడియా ముఖంగా అగార్కర్ వెల్లడించాడు. దీనిపై షమీ స్పందిస్తూ.. రంజీ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడేవాడిని.. వన్డేలు ఆడలేనా అని సమాధానం ఇచ్చాడు.
కాగా, షమీ వ్యాఖ్యలపై శుక్రవారం అగార్కర్ మరోసారి స్పందించాడు. ‘‘షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం ఇచ్చేవాడిని. అతడు నిజంగా ఫిట్‌గా ఉంటే.. అలాంటి బౌలర్‌ని ఎవరైనా కాదనుకుంటారా. గత ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో నేను అతడితో చాలాసార్లు మాట్లాడాను. ఫిట్‌గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేకపోయామని’’ అని అగార్కర్ అన్నాడు.
దీనికి షమీ ధీటుగా జవాబిచ్చాడు. ‘‘అతడు ఏం చెప్పాలనుకుంటాడో చెప్పనివ్వండి. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నానో మీరే చూస్తున్నారు. నేనెంత ఫిట్‌గా ఉన్నానో.. ఎలా ఆడుతున్నానో.. అంతా మీ కళ్ల ముందే ఉంది కదా..!’’ అని షమీ కౌంటర్ ఇచ్చాడు. షమీ చివరిసారిగా ఈ ఏడాది జరిగి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న అతడు.. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చాడు.