దీపావళి అన్ని పండుగల కన్నా ప్రత్యేకమైనది. ఇది ఇల్లును, పల్లెను, పట్నాన్ని, నగరాలను దీపాలతో, రంగురంగుల వెలుగులతో నింపి వేస్తుంది. దీపావళి అంటే దీపాల వరుస. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల సాంప్రదాయాలతో, రకరకాల కథల నేపథ్యంతో జరుపుకోవడం ఆనవాయితీ. అయితే కొన్ని రకాల కథలు ప్రహసనంగా నిలిచిపోయాయి. మరి కొన్ని మరుగున పడిపోయాయి. మన దేశంలో దీపావళి జరుపుకోవడానికి వివిధ సాంప్రదాయాలకు వివిధ కథలు ఉన్నాయి. వివిధ మతాలకు ప్రత్యేకించి ఈ దేశంలో ఆవిర్భవించిన మతాలకు మతాలకు వివిధ నేపథ్యాలున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం నరకాసురుడు అనే రాక్షసున్ని కృష్ణుడి భార్య హతమారిస్తే దానిని పండుగగా జరుపుకుంటున్నామని మనం వింటున్నాం. చదువుతున్నాం. మరి కొన్ని చోట్ల శ్రీరాముడు లంకలో రావణున్ని చంపి అయోధ్యకు చేరుకున్న రోజునే ఈ దీపావళి జరుపుకుంటున్నామని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఇవి ప్రజల జీవితాల్లో ఎక్కడ మనకు కనిపించదు. రామాయణ, భారతాల్లో చదివాం కాబట్టి నమ్ముతున్నాం.
అయితే మరొక సాంప్రదాయం ఇప్పటికే ప్రజలు అనుసరిస్తున్నారు. అది బౌద్ధ సాంప్రదాయం. గౌతమ బుద్ధునికి ఆయన జీవించిన కాలంలో ఎంతో మంది శిష్యులున్నారు. అందులో ఆనందుడు ఆయనకు నిత్యం అందుబాటులో ఉండేవాడు. అయితే ఆనందుని కన్నా చాలా ప్రతిభావంతంగా ఉన్న ఇద్దరు ఉన్నారు. వారి పేర్లు సారిపుత్త, మొగ్గల్లన్న (మౌద్గాలమన) వారిద్దరిని గౌతమ బుద్ధుడు ఎంతో ప్రేమతో చూసేవాడు. ఎందుకంటే వాళ్లిద్దరు ఆయన బోధనలను చాలా శీఘ్రంగా అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, ఎంతో శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేవారు. ఇందులో మొగ్గలన్న మరింత సమర్థవంతంగా వ్యవహరించేవాడు. అయితే వాళ్లిద్దరు బుద్ధుని కన్నా ఆరు నెలల ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆ సందర్భంలో గౌతమ బుద్ధుడు బుద్ధ సంఘంతో మాట్లాడుతూ, ‘సారిపుత్త, మొగ్గలన్నలేని సంఘం వెలితిగా కనపడుతున్నది.
వాళ్లిద్దరూ సంఘానికి పునాదిలాంటి వాళ్లు. వాళ్లిద్దరినీ మనం భౌతికంగా కోల్పోవడం ఒకింత శక్తిని తీసేసినట్టుంది’ అంటూ తన మనోవేదనను ప్రకటించారు. ఇందులో సారిపుత్త సహజంగా మరణిస్తే, మొగ్గలన్నను ప్రత్యర్థులెవరో హత్య చేసినట్టు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ వీరిద్దరినీ స్మరించుకోవడం ఎందుకంటే దీపావళి సాంప్రదాయానికి మొగ్గలన్నకు సంబంధం ఉంది. ఒక రోజు బుద్ధుడు సంఘంతో సంభాషిస్తూ, మొగ్గలన్న లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాడు. తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్లు తమ తల్లిదండ్రుల జ్ఞాపకాలను వదిలించుకోలేకపోతున్నారని, వారి కోసం ఏదైనా చేబుతారా అంటే గౌతమ బుద్ధుడు “తల్లిదండ్రులను జీవించిన కాలంలో గౌరవించాలి. ఆదరించాలి. వాళ్లు మరణించిన తర్వాత వారి ప్రేమను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసంలో బౌద్ధ బిక్కులకు సంఘం దానం చేయాలి. పూలు, పండ్లు సమర్పించి, కొవ్వొత్తుల దీపాలు వెలిగించి వారిని గుర్తు చేసుకోవాలి. ఇది మరణించిన తల్లిదండ్రులను సద్గతిలోకి పంపినట్లు అవుతుంది” అని ముగించారు ఇది ఉల్లంభవ సూత్రంలో పేర్కొన్నారు.
మన దేశంలోనే కాదు, చైనాలో, తైవాన్, కొరియా, జపాన్ లాంటి దేశాల్లో కూడా చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. వెలుగు జ్ఞానానికి చిహ్నం. జీవితమంటే చీకటి కాదు వెలుగుల సమాహారంగా భావిస్తుంటారు. అయితే ఇప్పటికీ తెలంగాణలో పూర్వీకుల తల్లిదండ్రుల సమాధుల దగ్గర దీపాలు వెలిగించి, పూలు పండ్లు పెట్టి భక్తిశ్రద్ధలతో పూర్వీకులను గౌరవించుకోవడం ఆనవాయితీ. నేను మొదటగా దీనిని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో చూశాను. కాని దీని గురించి విచారిస్తూ పోతుంటే తెలంగాణ అంతటా విస్తరించి ఉందని తెలుస్తున్నది. అన్ని జిల్లాల్లో సమాధులున్న చోట ఇది మనకు కనిపిస్తున్నది. అయితే హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా ఉన్న బ్రాహ్మణులలో ఈ సాంప్రదాయం లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు భౌతిక కాయాన్ని దహనం చేస్తారు. ఖననం చేయరు. అందువల్ల ఇది హిందువులలో కనిపించదు.
అంతేకాకుండా, ఆశ్వీయుజ మాసం బౌద్ధ సాంప్రదాయంలో మరొక ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఎందుకంటే బౌద్ధులు వర్షాకాలం నాలుగు నెలలు వర్షావాసంలో ఉంటారు. అంటే నాలుగు నెలలు సంచారం చేయరు. ఏదో ఒక చోట ఉండి బోధనలు చేస్తూ, నేర్చుకుంటూ తమ కాలాన్ని గడుపుతారు. అయితే వర్షాహను నుంచి బయటకు వచ్చేది ఈ నెలలోనే. వారు ఈ నెలలో బయటకు వచ్చినప్పుడు ప్రజలు సంతోషంతో ప్రతి ఊరిలో దీపాలు వెలిగించి స్వాగతాలు పలికేవారు. అంతేకాకుండా, గౌతముడు జ్ఞానంపొంది బుద్ధుడిగా మారిన 18 ఏళ్ల తర్వాత తన తండ్రి, ఆ పట్టణ ప్రజలు ఆహ్వానిస్తే వెళ్లాడు. ప్రజలంతా సంతోషంతో ఊరంతా దీపాలతో అలంకరించి స్వాగతం పలికారు. అది అమావాస్య రోజు. చిమ్మ చీకటి నూనె దీపాలు తప్ప మరొక వెలుగు లేదు. అందుకే ప్రతి ఇంటా దీపాలు వెలిగించారు. ఆ తర్వాత ఇది ఒక సాంప్రదాయంగా మారింది. ప్రతి సంవత్సరం వర్షావాసం ముగించుకొని వస్తున్న బౌద్ధ బిక్కులకు ఇంటింటా స్వాగతం పలికారు. అంటే దీపావళిగా మారిందని కూడా బౌద్ధ సాహిత్యం చెబుతున్నది.
జైన మతంలో కూడా దీపావళికి ఒక స్థానమున్నది. జైన తీర్థంకరులలో 24వ గురువు మహావీరుని మహా పరినిర్యాణం. ఇదే రోజున జరిగింది. ఆయన ప్రాణం మనకు వెలుగును అందించిందని, ఆయన దీపమై నిలిచాడని భావిస్తూ, జైనులు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. దీపావళిని తమ వ్యాపార వాణిజ్యాలకు ఆరంభ దినంగా కూడా భావిస్తారు. బౌద్ధ, జైన బోధనలను వారి ఆచార సాంప్రదాయాలను కనుమరుగు చేయడానికి వారి వ్యతిరేకులు దీపావళిని జరుపుకోవడం మొదలైందని చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. సమత, మమత, కరుణ, సమానత్వం, సత్యం లాంటి ఆలోచనలను ఆచరణను అందించిన బౌద్ధం మనకు ధమ్మ దీపోత్సవాన్ని కూడా ఇచ్చింది. అందుకే దీపావళి బౌద్ధుల, జైనుల పండుగగా మొదలై ఇప్పుడు అందరూ జరుపుకుంటున్నారు. బౌద్ధులు సామాజిక బాధ్యత కలిగిన వాళ్లు. దీపావళి రోజున మన పూర్వీకులను బుద్ధుడు, మొగ్గలన్న, సారిపుత్త లాంటి ఎందరో మహానుభావులను, మన పూర్వీకులను వారి కృషిని, త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరమున్నది. మనుషులందరూ సమానమేననే భావనను అందించిన బౌద్ధాన్ని అందించిన ధమ్మ దీపావళిని ఒక పండుగగా జరుపుకుందాం.
మల్లేపల్లి లక్ష్మయ్య
దర్పణం