సనాతన ధర్మానికి అపచారం పేరుతో ఈ మధ్య దేశంలో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై షూ విసిరిన ఘటన సంచలనం అయింది. అలాంటి ఘటన జరగడం ప్రపంచంలో ఇదే మొదటి సారికాదు. 2008 లో బాగ్దాద్ లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యు బుష్ పై ఇరాకీ జర్నలిస్ట్ షూ విసిరిన ఘటన పెను సంచలనమే అయింది. అయితే రెండు వేర్వేరు సందర్భాలు. ప్రజాస్వామ్యం పేరుతో వ్యూహాత్మక చమురు క్షేత్రాలపై పట్టుకోసం ప్రాచీన నాగరికత దేశాల దోపిడీపై జరిగిన నిరసన అది. శక్తివంతమైన పశ్చిమ దేశాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించాయి. ఇరాక్ పాలకులు ఒకప్పుడు వారి అనుయాయులు ప్రస్తుతం టెర్రరిజం స్పాన్సర్ గా ముద్రపడ్డారు. ఏమైనా షూ విసిరిన ఘటన రెండు సందర్భాల్లోనూ సంచలనమే. భారతదేశంలో అణగారిన వర్గాలు పేద దళితులు, ఆదివాసీలకు, ముఖ్యంగా మహిళలకు చాలాకాలం వారు హద్దు మీరకుండా చూపిన ఆయుధం షూ (చెప్పులు). దశాబ్దాలపాటు వారిని అవమానించినా, వేధించినా ఎవరికీ పట్టలేదు.
ఆ ఘటనలు నమోదు కాలేదు. అది వారి ఖర్మ, దురదృష్టంగా వదిలేశారు. అధికార స్థానంలో ఉన్న వారిపై షూ విసిరితే దేశవ్యాప్తంగా గగ్గోలు చెలరేగింది. తాజా సందర్భంలో సనాతన ధర్మ రక్షణ కోసం అదీ దళితునిపై ఓ న్యాయవాది షూ విసరడం అన్నది అర్థం లేనిది. భారత దేశంలో చాలా గ్రామాలలో ఇప్పటికీ అగ్రకులాలకు చెందినవారు దళితులైన వంటవారు వండిన మధ్యాహ్న భోజనం ముట్టడం లేదు. దళితులకు మధ్యాహ్న భోజనం వంట పని అప్పగించినందుకు నిరసనలు జరిగిన సందర్భాలు ఎన్నో. ఏ మతం ఈ వైఖరిని ఖండించలేదు. అలాగే సమర్థించలేదు. ఇటీవలి కాలంలో సనాతన ధర్మం కొత్త యుద్ధ నినాదంగా మారింది. సంప్రదాయం పేరుతో మహిళలను జీన్స్ ధరించరాదని ఆంక్షలు పెడుతున్నారు. పితృస్వామ్య వ్యవస్థ తాబేదారులుగా మారినవారు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ, తమ స్వేచ్ఛకు తామే అడ్డుపడుతున్నారు. సనాతన ధర్మ సంసృ్కతి అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ, జీన్స్ ధరించిన పురుషులే ఈ చర్యలకు దిగుతున్నారు. సనాతన ధర్మ పురుషులు జీన్స్ ధరించవచ్చని బోధించిందా.. మహిళలు జీన్స్ ధరిస్తే భయం ఎందుకు? స్వాతంత్య్ర పోరాటం జరిగిన రోజులలో బ్రిటీష్ పాలకులనుంచి స్వరాజ్యం కోసమే కాదు. కుల, మత, జాతి, వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం సాగింది. సంకుచిత భావాలు సమసిపోయాయి.
ఇప్పుడు ఆ విశాల భావాలు, ఆశయాలు చెదరిపోయాయి. ప్రస్తుతం సామాజిక న్యాయం పేరుతో పోరాటం సాగుతున్నా గౌరవం, గుర్తింపు, రాజకీయపరమైన గుర్తింపు, హక్కుల కోసమే సాగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది తన కులాన్ని గొప్పగా ప్రదర్శించుకోవడానికి తంటాలు పడుతున్నారు. వారి దృష్టిలో సామాజిక సమానత్వానికి విలువలేదు. వివక్ష చూపడం, ఆధిపత్యం తన హక్కుగా ప్రవర్తిస్తున్నారు. సామాజికంగా అణచివేతకు గురైనవారికి రాజ్యాంగాన్ని ఆశ్రయించడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. దీంతో అగ్రకులాలు సనాతన ధర్మంపై దాడి జరుగుతోందని గగ్గోలు చేస్తున్నాయి. సనాతన ధర్మం అంటే ఏమిటి? వేదాలలో ధర్మపై ఖచ్చిత మైన, విస్తృతమైన నిర్వచనం ఏమీ లేదు. అయితే రుగ్వేదంలో (10/ 190/11) ధర్మంను సత్యంతో కూడినదిగా పేర్కొంది. బృహదారణ్యకోపనిషత్తు, ధర్మం అంటేనే సత్యం అని నిర్వచించింది. సత్యమే గొప్పది. సత్యం కన్నా మరేమీ లేదు. యోగ వాసిష్టం కూడా సత్యమే ధర్మంగా పేర్కొంటుంది. ధర్ అన్న వ్యుత్పత్తి నుంచి ధర్మ అన్న పదం పుట్టింది. ధర్ అంటే కలిగి ఉండునది, భరించునది, సత్య శోధకులు సత్యం అంటే ధర్మం కోసం చేసే కృషిగా పేర్కొన్నారు. అంటే ధర్మం ఎవరికీ వ్యతిరేకం కాదు. ధర్మం విషయంలో ఎవరూ గొప్పకాదు.
అది అనుసరించే అందరూ గౌరవింపబడతారు. ధర్మానికి పునాది అహింస. అహింస ద్వారానే సత్యం మనుగడ సాగిస్తుంది. భిన్న పద్ధతులలో జనం వ్యవహరించేందుకు అహింస తగిన స్థైర్యాన్ని ఇస్తుంది. అయితే, తమ మతం లేదా వ్యవహారంపై ఎవరైతే అహంకారంతో వ్యవహరిస్తారో అక్కడ సత్యం తన గొప్పతనాన్ని కోల్పోతుంది. అందుకే అహింస ధర్మానికి పునాది అయింది. విష్ణు పురాణంలో (సంపుటి 1, అధ్యయనం 7)లో అహింసను సత్యంతో విడదీయరానిదిగా పేర్కొంది. అహింస అంటే హింసకు వ్యతిరేకమైనది. ఈ నేపథ్యంలో ధర్మం పేరుతో షూ విసరడం అహింసను కాలరాయడమే. మొత్తం వివాదానికి సనాతన ధర్మం కేంద్ర బిందువైంది. నిజానికి సనాతనం అంటే ఏమిటన్నదే ప్రశ్న? అథర్వణ వేదం (10/8,/201) చక్కటి నిర్వచనం ఇచ్చింది. సనాతనం అనేది శాశ్వతమైన, కాలాతీతమైన, ప్రారంభం కానీ, ముగింపు కానీ లేదని సూచిస్తుంది. పగలు, రాత్రి అనేది లేదనిగా, మార్పు లేనిదిగా పేర్కొంటుంది. అంటే సనాతనం సంప్రదాయాలకు అతీతమైనది. అంటే అది షూ విసరడానికి కానీ, జీన్స్ ధరించకుండా నిరోధించడానికి కానీ, అనుమతించదు. సనాతన అంటే ఉపనిషత్తులలో పేర్కొన్న నలుగురు సనత్ బంధువుల వంటిది. అహంకారానికి కానీ, అజ్ఞానానికి కానీ తావులేనిది. కాలానుగుణంగా పునర్నిర్వచించుకోగలిగినది. సనాతనం స్ఫూర్తిదాయకమైనది. శాస్త్రీయ విజ్ఞానం, సత్యాన్వేషణలో ఎదురయ్యే సవాళ్లను ప్రశ్నించేది. అలాంటి సనాతన ధర్మం పేరుతో షూ విసరడం దారుణాతి దారుణం. సత్యానికి తావులేని నాడు ధర్మం లేదు. సనాతనం కూడా లేనట్లే. అటువంటి దారుణాలకు పాల్పడడం ధర్మం కాదు.
మీనాక్షి నటరాజన్
(తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్)