అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనాన్ని టిడిపి వర్గీయులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్తుండగా తమ వాహనాలపై టిడిపి శ్రేణులు దాడికి పాల్పడ్డారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన మరది వైసిపి ఎంపిపి వెంకట రామిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. వైసిపి నాయకులు గ్రామంలోకి అడుగు పెట్టొద్దని టిడిపి కార్యకర్తలు కెఇ చంద్ర, శ్రీధర్ గౌడ్, నక్క రాజు, మరి కొంతమంది రాళ్లతో, కర్రలతో దాడికి పాల్పడ్డారు. మహిళా నాయకురాలు అని చూడకుండా దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి గుండాలు గ్రామంలో రెచ్చిపోతూ భయబ్రాంతులకు గురిచేశారని శ్రీదేవి దుయ్యబట్టారు. తమపై దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు బయటకు రావాలంటే ప్రాణభయంతో వణికిపోతున్నారన్నారు.