మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కోరుతూ ఈ నెల 18 శనివారం చేపట్టిన తెలంగాణ బంద్‌కు భారీ ఎత్తు న మద్దతు పెరిగింది. అన్ని రాజకీయపార్టీలు, బిసి సంఘాలు, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో మద్ద తు ప్రకటించాయి. బిసిలంతా ఏకమై తొలిసారి చే పడుతున్న రాష్ట్ర బంద్‌కు కనీవినీ ఎరుగని మద్దతు వస్తోంది. ‘బంద్ ఫర్ జస్టిస్’ నినాదంతో గతంలో జరిగిన సకల జనుల సమ్మెను గుర్తుకుతెచ్చేలా ఒకే మాటపై నిలబడి బంద్‌లో పాల్గొనేందుకు తె లంగాణ బీసీ జేఏసీ’ చైర్మన్ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెం చిన రిజర్వేషన్లను రక్షించుకోవడానికి శనివారం చేపట్టే బంద్‌కు ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్, బిజె పి, బిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం టీజేఎస్, సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతోపాటు సామాజిక ఉద్యమ శక్తులైన ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసి, గిరిజన, మైనార్టీ సంఘాలు, అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
బిసి సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలన్నీ మూసివేయాలని నిర్ణయించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సైతం బంద్‌కు మద్దతు ప్రకటించి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలావుండగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, వామపక్షాలతో పాటు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పల్లె నుండి పట్నం వరకు సంపూర్ణంగా బంద్ జరుగుతున్నందున రాష్ట్ర ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని బంద్ నిర్వాహక సంస్థలన్నీ ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
మద్దతు ప్రకటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
అధికార కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. బంద్ లో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారని వెల్లడించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని అన్నారు. రిజర్వేషన్లను అడ్డుకునే బీజేపీ ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మధుయాష్కి గౌడ్ తెలిపారు. కొంతమంది కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం తదితర పరిణామాలతో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ఇక క్షేత్రస్థాయి నుంచి, ప్రజల మమేకంతో పోరాటానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదనే పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీసీ సంఘాల పిలుపుతో శనివారం చేపట్టే రాష్ట్ర బంద్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. శుక్రవారం వివిధ విభాగాలలోని బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డిని, ఇతర జేఏసీ నాయకులను కలిసి బంద్ మద్దతు కోరారు. ఈ మేరకు బంద్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. అలాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం నాడు నారాయణగూడ వైఎంసిఏ చౌరస్తా నుండి ఆర్‌టిసి క్రాస్ రోడ్ వరకు ఉదయం 11 గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.
బంద్ విజయం కోరుతూ బిసి సంఘాల ర్యాలీ
బంద్‌కు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఈ ర్యాలీలో ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొన్నారు. అలాగే 42 శాతం రిజర్వేషన్ న్యాయబద్ధమైనది పేర్కొంటూ రాష్ట్ర బంద్ కు ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక పూర్తి మద్దతు తెలిపింది.
నేడు సకలం బంద్: జాజుల శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర బంద్‌తో రాష్ట్రంలో సకలం బంద్ చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి తొలిసారిగా బీసీ బంద్‌కు మద్దతుగా ఇటు లెఫ్టిస్టులు ఆటో రైటిస్టులు, ఇంకొక వైపు లౌకిక శక్తులు సామాజిక శక్తులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
’బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని కల్వకుంట్ల కవితను కోరిన కృష్ణయ్య
తెలంగాణ బీసీ జేఏసీ’ చైర్మన్ ఆర్. కృష్ణయ్య ’బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కోరారు. ఈ మేరకు ఆమె నివాసానికి వెళ్లిన కృష్ణయ్యతో కవిత మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిం కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అర్హత లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొంటోందని తెలిపారు. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ముందుండి పోరాడుతున్న తెలంగాణ జాగృతి బంద్ కు సంపూర్ణ మద్దతునిస్తోందని ప్రకటించారు. ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహిస్తారని, ఈ మానవహారంలో కవిత పాల్గొంటారని జాగృతి వర్గాలు తెలిపాయి.
అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: డిజిపి శివధర్‌రెడ్డి
రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీలు, ప్రజా సంఘా లు, బిసి సంఘాలు శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు బంద్ పరిస్థితులను పర్యవేక్షిస్తాయని డిజిపి శుక్రవారం స్పష్టం చేశారు. బం ద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిజిపి కోరారు.