మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ దండుపాళ్యం ముఠాలా మా రిపోయిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఎద్దేవా చేశా రు. మంత్రుల పంచాయితీలు పరిష్కరించడానికే కేబినెట్ సమావేశాలు పె డుతున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒ కరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్ల కోసం, కబ్జాల కోసం ఒకరు అని మంత్రులు వర్గాలుగా విడిపోయారని ఆరోపించారు. కేబినెట్ భేటీలో మంత్రులు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్ ఆర డజను వర్గాలుగా విడిపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతగా తయారైందని అన్నారు.
కేబినెట్ సమావేశంలో ప్రజలకు సంబంధించిన అంశాల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతారు అనుకున్నామని చెప్పారు. దసరాకు మొండి చేయి చూపారు, దీపావళి కానుకగా ప్రజలకు ఏదైనా తీపి కరుబు చెబుతరేమో అనుకున్నామని…కానీ, తీవ్ర నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని ఆరోపించారు. వ్యాపారవేత్తలపై తుపాకులు ఎక్కుపెట్టే సంస్కృతిని రేవంత్ హయాంలో తీసుకొచ్చారని ఆక్షేపించారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా.. కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆక్షేపించారు. కెసిఆర్ హయాంలో నీళ్లు, నిధుల వాటాలు సాధించామని ఉద్ఘాటించారు. రేవంత్‌రెడ్డి హయాంలో మాత్రం అవినీతి వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలు, సినిమా ఇండస్ట్రీ, కాంటాక్టర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించి లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించారని, నీళ్లలో, నిధుల వాటా కోసం కొట్లాడారని చెప్పారు. కానీ, ఇప్పుడు మంత్రులు కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం,
అక్రమ వసూళ్లలో వాటా కోసం మంత్రులు కొట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం డిపార్టుమెంట్లే రద్దు చేస్తున్నారని అన్నారు. పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా హీరోలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పిదాల వల్ల టిఎస్‌ఐపాస్ వచ్చిన తర్వాత గత ఎనిమిదేళ్లలో అతి తక్కువ పరిశ్రమలు, పెట్టుబడులు రేవంత్ రెడ్డి హయాంలో వచ్చారని అన్నారు. 2024-25లో కేవలం 2049 పరిశ్రమలు, 50 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, ఇది టిఎస్‌ఐపాస్ ఏర్పడిన తర్వాత అతితక్కువ పెట్టుబుడులు అని పేర్కొన్నారు. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ ఘన కార్యం అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం టిఎస్‌ఐపాస్ తెచ్చి అనుమతులు సులభతరం చేశామని, రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వర్షం కురుస్తుంటే కెటిఆర్ స్వయంగా గొడుగుపట్టి ఆహ్వానించారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారని మండిపడ్డారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి
సిఎం రేవంత్‌రెడ్డిపై కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారని హరీష్‌రావు గుర్తుచేశారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించారని, ముఖ్యమంత్రే స్వయంగా జపాన్ నుంచి ఫైల్ ఆప్పించారని, ఒక మంత్రి టెండర్ వేయవద్దని తమకు హుకుం జారీ చేశారని, టెండర్ దక్కలేదని డిపార్ట్‌మెంట్‌నే మార్చివేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రే తమ్ముళ్ల కోసం ఫైల్స్ ఆపుతున్నారని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే కాంగ్రెస్, బిజెపి మధ్య అక్రమ సంబంధం ఉందని భావించాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు నోరు మెదపటం లేదు..? అని నిలదీశారు.
ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు..?
రేవంత్‌రెడ్డి హయాంలోని 23 నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు..? అని హరీష్‌రావు ప్రశ్నించారు. తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినందుకా… కమీషన్ల కోసం కేబినెట్‌లో గల్లాలు పట్టుకొని కొట్టుకున్నందుకా… మంత్రుల మధ్య తగాదాలు జరుగుతున్నందుకా… ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతుంది..? నిలదీశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని అన్నారు. అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసినందుకు విజయోత్సవాలు జరుపుతారా..? అని ప్రశ్నించారు. నెలకు రూ. 2500 ఇస్తారేమోనని మహిళలు ఎదురు చూశారు..కానీ, కేబినెట్ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయని వర్గం లేదని ఆరోపించారు. రైతుబంధు ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు ఉత్సవాలు జరుపుతారా.. గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా రాలుతున్నందుకు ఉత్సవాలు జరుపుతారా.. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా..? అని నిలదీశారు.
పారిశ్రామిక వేత్తలు, పేదలకు బిఆర్‌ఎస్ అండగా ఉంటుంది
పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు, సినిమా పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పేదలకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్‌రావు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురావాలని, తాము కాపాడుతామని వ్యాపారులకు చెప్పారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని అన్నారు. డిజిపి శివధర్ రెడ్డి కాకీ బుక్‌లో మంత్రులకు రూల్స్ వేరేలా ఉన్నాయా..? అని ప్రశ్నించారు. టెండర్లు వేయొద్దని మంత్రులు బెదిరిస్తుంటే.. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే వారి మీద కేసు లేదు. ఒక ట్వీట్‌కు రీట్వీట్ చేస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు.
హ్యాం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారు
హ్యాం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే జిఒ 53, 54లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేశారని అద్నరు. పేద, మధ్య తరగతి ప్రజలను రేవంత్‌రెడ్డి దొంగ దెబ్బ కొట్టారని మండిపడ్డారు. లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల రక్తం పీల్చుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హ్యాం మోడల్ అనేది ఒక బోగస్ అని, దాని పేరు చెప్పి కమీషన్లు దండుకోవడమే తప్ప ప్రభుత్వం చేస్తున్నదేం లేదని విమర్శించారు. హ్యాం మోడల్‌పై బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని హెచ్చరించారు.