త్రిపురలో ఓ గ్రామంలో చొరబడి ముగ్గురు బంగ్లాదేశీయులు పశువులను దొంగిలించుకు పోతుండగా, అడ్డుకున్న గ్రామస్తుడిని చంపడంతో గ్రామస్తులు రెచ్చిపోయి వారు ముగ్గురినీ చంపివేశారు. అక్టోబర్ 15న జరిగిన ఈ ఘటన భారత -బంగ్లా మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్ ఈ ఘటన పై తీవ్ర నిరసన తెలిపింది. మృతులకు న్యాయం చేయాలని, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. బంగ్లా వాదనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కొట్టివేసింది.భారత భూభాగంలో 3 కిలోమీటర్ల దూరంలో బిద్యాబిల్ గ్రామంలో బంగ్లా అక్రమ వలసదారులు, పశువులను దొంగిలిస్తుండగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. వారిపై దొంగలు కత్తులతో దాడిచేసి,
ఒకరిని చంపివేయడంతో స్థానికులు తమను తాము రక్షించుకునేందుకు వారితో ఘర్షణ పడి చంపివేశారని తెలిపింది. విషయం తెలిసి, అధికారులు ఆ గ్రామానికి చేరుకునేటప్పడికే ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. మృతదేహాలను బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జైస్వాల్ తెలిపారు.అక్రమ వలసదారులు కత్తులు, ఇతర ఆయుధాలతో స్థానిక గ్రామస్తులపై దాడిచేసి,ఒకరిని చంపివేయడంతో గ్రామస్తులు వారిని ప్రతిఘటించారని, ఘర్షణలో ఇద్దరు అక్కడికి అక్కడే, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారని తెలిపారు. అక్రమ వలసలు ఆపేందుకు, స్మగ్లింగ్ ను అరికట్టేందుకు సరిహద్దుల్లో కంచెలను నిర్మించాలని జైస్వాల్ బంగ్లాదేశ్ కు సూచించారు.