ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు టీం ఇండియా ఆ దేశానికి వెళ్లింది. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడుతున్న సిరీస్ ఇది కావడంతో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సిరీస్ కోసం జట్లను ఎంపిక చేసిన విషయంలో సెలక్టర్లపై చాలానే విమర్శలు వచ్చాయి. అందులో సంజూ శాంసన్‌ని వన్డే జట్టులో ఎంపిక చేయకపోవడం ఒకటి. అయితే తాజా ఈ విషయంపై ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. సంజూ శాంసన్, రింకూ సింగ్‌లపై ప్రశంసలు కురిపించాడు.
సంజూ, రింకూలు జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకునేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘టిం ఇండియా టి-20 జట్టులో తమ స్థానం పదిలం చేసుకొనేందుక సంజూ, రింకూలు చాలా కష్టపడ్డారు. ఐపిఎల్‌లో అద్భుత ప్రదర్శనలు చేశారు. ముఖ్యంగా రింకూ ఐపిఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. భారత్‌లో ఇప్పటికే ఎందరో వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు ఫియల్‌లెస్ యంగ్‌స్టర్లు కూడా వచ్చేశారు. ఇది భారత క్రికెట్‌కి శుభపరిణామం. ఆస్ట్రేలియాకు ఈ యువ ఆటగాళ్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు అగ్ని పరిక్ష వంటిది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తొంభై వేల ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వార్నర్ అన్నాడు. అక్టోబర్ 19 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టి-20ల సిరీస్ జరుగనుంది.