హైదరాబాద్: మన రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తి మన రాష్ట్రం ముందుంది అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు పడినప్పుడు పత్తిలో తేమ శాతం పెరుగుతుందని, మన రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు 122కు చేరుతున్నాయని తెలియజేశారు. తేమ శాతం 12 కంటే పెరగకుండా రైతులు చూడాలని సూచించారు. కిపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతుల వివరాలు, పంటల విస్తీర్ణం సేకరిస్తున్నామని, 9 ప్రాంతీయ భాషల్లో కిపాస్ కిసాన్ యాప్ తీసుకువచ్చామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
పత్తికి మద్దతు ధర పెంచి సిసిఐ కొనుగోలు చేస్తోందని, కేంద్రం రూ. 600 కోట్లతో కపాస్ క్రాంతి మిషన్ ను ఏర్పాటు చేసిందని అన్నారు. పత్తి కొనుగోళ్లకు దేశవ్యాప్తంగా నిబంధనలు ఉన్నాయని, రైతులకు మేలు జరిగేలా జిన్నింగ్ మిల్లులను మ్యాపింగ్ చేశామని స్పష్టం చేశారు. తెలంగాణలో పదేళ్లలో పత్తి కోసం రూ.58 వేల కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని, యాప్ లో ఇచ్చిన స్లాట్ ప్రకారం వస్తే వెంటనే కొనుగోలు పూర్తవుతుందని అన్నారు. పత్తికి మద్దతు ధర అందేలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూడాలని కిషన్ రెడ్డి కోరారు.