క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఫిట్‌నెస్ కలిగిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ప్రథమ స్థానంలో ఉంటాడు. ఎలాంటి పరిస్థితులో అయినా చిరుతలా వేగంగా పరుగులు తీస్తాడు కోహ్లీ. అతడి పరుగు చూసి ప్రత్యర్థులు సైతం ఫిదా కావాల్సిందే. కాగా, చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన విరాట్.. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్‌కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆసీస్‌కు చేరుకొని అక్కడ సాధన ప్రారంభించాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ఆసీస్ వెటరన్ పేసర్ కేన్ రిచర్డ్‌సన్ ఆసక్తికర విషయాలు గుర్తు చేసుకున్నాడు. 2017లో కోల్‌కతాలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఆ రోజు కోహ్లీ ఫిట్‌నెస్ చూసి ఆశ్చర్యమేసిందని రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు.
‘‘కోల్‌కతాలో జరిగిన మ్యాచ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. మ్యాథ్యూ వేడ్ కీపింగ్ చేస్తున్నాడు. నేను మైదానంలోకి అడుగుపెట్టే సమయానికి అతడు చెమటలతో తడిసిపోయాడు. ప్యాట్ కమ్మిన్స్ కూలర్ బాక్స్ వద్ద కూర్చున్నట్లు గుర్తు. జంపా అతడికి డ్రింక్ అందిస్తుండగా.. ఎవరో బౌల్‌లోకి పరిగెత్తుతున్నారని అన్నాను.. ప్యాటీ.. బౌలర్ లోపలికి పరిగెత్తుతున్నాడని జంపా కూడా అన్నాడు. ప్యాటీ మాత్రం తనకు తెలుసు అన్నట్లుగా కూర్చొని ఉండిపోయాడు. అక్కడి వాతావరణం అంత వేడిగా ఉంది. మేమంతా చనిపోతామేమో అని భయం వేసింది. కానీ, విరాట్ మాత్రం ఎసి వేసుకొని త్రెడ్ మిల్ మీద పరగెడుతున్నట్లుగా సింగిల్స్, డబుల్స్ తీస్తున్నాడు. మీకు డౌట్ ఉంటే ఆ మ్యాచ్ వీడియో ఫుటేజీలను గమనించండి. ఐస్‌తో కూడిన నెక్లెస్‌లు వేసుకున్నట్లు ఉంటారు. అందరి ముఖాలు పాలిపోయి ఉంటాయి. ఎవరూ మాట్లాడుకోరు. వికెట్ వచ్చిన పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అసలు ఎనర్జీ లేదు. కానీ, విరాట్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పరిస్థితులు తనను ఏమీ చేయలేవు అన్నట్లుగా పరులు తీశాడు’’ అని రిచర్డ్‌సన్ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 252 పరుగులు చేసింది. అందులో విరాటే 107 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అందులో 60 పరుగులు సింగిల్స్, డబుల్స్ రూపంలో రావడం విశేషం. చివరకి ఆసీస్ 202 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.