రాయ్‌పూర్: మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియస్ ఆశన్న అలియాస్ రూపేష్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. తన ఉద్యమ సహచరులు 208 మంది కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. ఇదే అతిపెద్ద లొంగబాటు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తన 60 మంది మావోయిస్టులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇద్దరు మావోయిస్టుల అగ్రనేతలు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం నర్సింగాపూర్ గ్రామంలో వాసుదేరావు జన్మించారు. లక్ష్మీదేవి పేట ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం హనుమకొండలోని ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యను పూర్తి చేశాడు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమాలపై వెళ్లాడు. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో పని చేస్తూ 25 ఏళ్ల వయసులో పీపుల్ష్‌వార్ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. హోంమంత్రి మాధవ్ రెడ్డి, ఐపిఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్యలకు ఆశన్న నేతృత్వం వహించినట్టు సమాచారం. అలాగే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం నేదరుమల్లి జనార్తన రెడ్డిపై బాంబు పేల్చి హత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం.