‘అంధులకు చూపు కావాలి.. నిరుద్యోగులకు జాబు కావాలి’ ఇది బీహార్‌లో నిరుద్యోగ యువత నుంచి వినిపిస్తున్న నినాదం. ప్రభుత్వ ఉద్యోగం దక్కకుంటే కూరగాయలు అమ్ముకోవడమో లేదా కూలిపనులకు వెళ్లడమో తప్పదన్న నిర్వేదనతో ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లకు యువత ప్రిపేర్ కావడం బీహార్‌లో కనిపించే జీవన చిత్రం. పాట్నా లోని ఎపిజె అబ్దుల్ కలాం సైన్స్ సెంటర్ బయట పరిసరాల్లో ఫుట్‌పాత్‌లపై నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తుండడం నిత్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు బీహార్‌లో ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు గట్టి ప్రయత్నం చేయలేదనే చెప్పక తప్పదు. కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాయకులు యువ ఓటర్లను ఆకట్టుకోడానికి ఏవో పథకాలను ప్రకటించి అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎన్‌డిఎ కూటమి, మరోవైపు విపక్ష నేతలు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వియాదవ్ తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పదేపదే భరోసా ఇస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎలాంటి గట్టి అవకాశాలు కల్పించని వారు ఎన్నికల్లోనే దీన్ని తెరపైకి తీసుకు రావడం నవ్వు తెప్పిస్తోంది. ఇదంతా ఓట్ల కోసం నిరుద్యోగులకు లేనిపోని భ్రమలు కల్పించి చెవిలో పువ్వులు పెట్టడమే తప్ప మరేమీ కాదు. ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్‌లో చాలామంది యువ ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే తమకు అత్యంత టాప్ ప్రయారిటీ అని అంగీకరిస్తున్నారు. రాష్ట్రం లోని ఓటర్లలో 22 శాతం మంది అంటే 1.63 కోట్ల ఓటర్లు 18 నుంచి 23 ఏళ్ల వారే. వీరిలో 1.5 కోట్ల మంది 20 ఏళ్ల వయసు దాటిన వారే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో 14 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చుకున్నాక తుది జాబితా విడుదలైంది. ఈ కీలకమైన ఓటర్లను గెలవడానికి పాలనలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్‌డిఎ). విపక్ష గ్రాండ్ అలియన్స్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన హామీని పరాకాష్ఠకు తీసుకెళ్తున్నాయి. నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇటీవల వివిధ రంగాల్లో నిరుద్యోగులకు లక్షలాది అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేయడమైందని ప్రకటించింది. దీనికి తోడు భవిష్యత్తులో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనేక సందర్భాల్లో హామీ ఇస్తున్నారు.
మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ గత గ్రాండ్ అలియన్స్ ప్రభుత్వకాలంలో తాను డిప్యూటీ సిఎంగా ఉన్నప్పుడు 17 నెలల వ్యవధి లోనే యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించడమైందని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారం లోకి వస్తే ఎన్ని ఉద్యోగాల లభిస్తాయో ఎవరైనా ఊహించవచ్చని ఊరిస్తున్నారు. దీన్ని ఇప్పుడు యువత ప్రశ్నిస్తోంది. ఎన్నికల సమయం లోనే యువత ఉద్యోగాల సమస్య మీకు గుర్తొస్తొందా? ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు చేయలేదు? అన్న ప్రశ్నలు యువతనుంచి ఎదురవుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) 2021 22 ప్రకారం బీహార్‌లో నిరుద్యోగ రేటు 5.9 శాతం వరకు ఉంది. జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 4.1 శాతం కన్నా బీహార్‌లోనే నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉండడం గమనార్హం.
అలాగే బీహార్‌లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసు వారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం కావడం బట్టి బీహార్‌లో నిరుద్యోగం ఎలా తాండవిస్తోందో తెలుస్తోంది. బీహార్‌లో ఉద్యోగ అవకాశాలు కరవు కావడంతో లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం నిత్యదృశ్యమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క ప్రభుత్వేతర అనధికారిక ఉపాధి మార్గాల పైన, స్వయం ఉపాధిపైన, క్యాజువల్ ఉద్యోగాల పైన ఆధారపడి బతుకుతున్నారు. బీహార్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం సర్వసాధారణం కాగా, అర్బన్ ఏరియాల్లో తమ నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఒక పనికి అవసరమైన వారి కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు కనిపిస్తుంటారు. వ్యవసాయ రంగంలో ఈపరిస్థితి కనిపిస్తుంది.
యువ ఓటర్ల మనోగతం తెలుసుకోడానికి ప్రయత్నించినప్పుడు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ అభిమాన నాయకులు లేదా పార్టీ ఎవరికి మీరు ఓటేస్తారని అడగ్గా.. కొంతమంది ప్రతి ఐదేళ్లకు పాలనలో మార్పు తప్పనిసరి అని తమ అభిప్రాయం వెలిబుచ్చగా, మరి కొంతమంది ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే తమ ప్రాధాన్యమని వెల్లడించారు. మొత్తంమీద రాష్ట్రం కోసం ఆయన బాగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రశాంత్ కిశోర్ బీహార్ యువకుల, ప్రజల వాస్తవ సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. యువతలో ఒక వర్గం తేజస్వియాదవ్‌పై మొగ్గు చూపుతోంది. ‘ఆయన యువకుడు, అంతేకాక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ లాంటి యువకులకు కొత్తగా ఉద్యోగాలు కల్పించడానికి గట్టిగా ఏదో ఒకటి చేయగల’రని నమ్ముతోంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడిన తరువాత ఎవరైతే అధికారం లోకి వస్తారో వారు ఉద్యోగాల్లో యువతకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఉందని, నూటికి నూరు శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేలా చూడవలసిన బాధ్యత ఉందని యువకుల నుంచి ఏకాభిప్రాయం వస్తోంది.