హైదరాబాద్ మహా నగరాన్ని పట్టిపీడిస్తోన్న ‘మత్తు’ను వదలించేందుకు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. భాగ్యనగరాన్ని డ్రగ్స్ విక్రయాలకు, తయారీకి అడ్దాగా చేసుకున్న మాఫియా భరతం పట్టేందుకు ఉక్కుపాదం మోపుతోంది. నిన్నటివరకు క్రయవిక్రయాలపై దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం… డ్రగ్స్ తయారీ ముఠాలపై కూడా డేగకన్ను పెట్టింది. నగరంలో డ్రగ్స్ ఊసేలేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ విక్రయాలు జోరందుకుంటుండటాన్ని సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం ప్రత్యేక పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రముఖులు నివసించే ప్రాంతాలనుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డ్రగ్స్ విక్రయాలు కొనసాగడం ప్రభుత్వానికి సవాల్‌గా మారడంతో సరఫరాతో పాటు తయారీ ముఠాల ఆగడాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. పబ్‌లు.. వీకెండ్ పార్టీలు, రిసార్టు ఫంక్షన్లపై నిఘా పెట్టింది. పరిశ్రమల పేరిట గుట్టుగా డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాల భరతం పడుతోంది. ఈగల్ టీమ్ ఏర్పాటు చేసిన తరువాత నగరంలో డ్రగ్స్ మాఫియా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నగరంతో పాటు శివార్లలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈగల్ టీమ్ ముందుగా నగరంలో క్రయవిక్రయాలు, సరఫరాపైనే దృష్టి సారించగా, మహారాష్ట్ర పోలీసులు నగరంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నాకే అప్రమత్తమైన నగర పోలీసులు దూకుడు పెంచింది.
ముంబయిలో బంగ్లాదేశ్ మహిళ డ్రగ్స్‌తో పట్టుపడగా… విచారణలో చర్లపల్లిలో వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారీ వెలుగు చూసింది. సుమారు రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ దందా నగరంలోని చర్లపల్లి కేంద్రంగా సాగుతున్నట్లు… ఇక్కడినుంచే దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు తెలియడంతో నగరవాసులతో పాటు పోలీసులు విస్తుపోవల్సివచ్చింది. ఈ కేసులో రూ. 11.58 కోట్ల ముడి సరకులతో పాటు 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసు బోయిన్‌పల్లిలో బట్టబయలయ్యింది. ఓ తయారీదారుడు స్కూల్ నిర్వహకుడే కావడం విశేషం. తన పాఠశాలలోనే డ్రగ్స్ తయారీ చేస్తూ ఈగల్ టీమ్‌కు దొరికిపోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. బోయిన్‌పల్లిలో మేధా స్కూల్‌ను నిర్వహిస్తున్న జయప్రకాష్‌గౌడ్ పాఠశాల రెండో అంతస్థులోనే డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. పాఠశాలలో అల్ఫోజోలుం తయారీ చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కల్లు కంపౌండ్‌లకు భారీగా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
పాఠశాలలో డ్రగ్స్ తయారీని సీరియస్‌గా పరిగణించిన అధికార యంత్రాంగం పాఠశాలను సీజ్ చేసి నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత వారం జీడిమెట్ల సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో గుట్టుగా డ్రగ్స్‌ను తయారీ చేస్తున్నారన్న సమాచారంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించి రూ. 72 కోట్ల విలువజేసే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో నలుగురు నిందితులను కూడా అరెస్టు చేసింది. ఏకంగా ఫ్లాట్‌లోని ఎపిడ్రిన్ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పోలీసు వర్గాలను సైతం నివ్వరపరిచింది. నగరంతోపాటు శివార్లలో ఈగల్ బృందం నిఘాను మరింత ముమ్మరం చేస్తోంది. డ్రగ్స్ విక్రయాలు, తయారీపై ఉక్కుపాదం మోపి… హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఈగల్ టీమ్ పేర్కొంటుంది.
ఎం.వి. శివశంకర్
93953 45694