మన తెలంగాణ / అమరావతి : 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయులదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు. 2047 నాటికి మన దేశం వికసిత భారత్‌గా మారాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు కీలక సహకారం అందిస్తోందని చెప్పారు. గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. ‘అమెరికా వెలుపల తమ అతిపెద్ద పెట్టుబడిని ఏపీలో పెడుతున్నట్లు గూగుల్ సీఈఓ స్వయంగా చెప్పారన్నారు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్, డేటా సెంటర్, సబ్-సీ కేబుల్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయని,
ఈ సబ్- సీ కేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్‌వేగా మారనుందని మోదీ తెలిపారు. గురువారం కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 16 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా ఏపీ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తుండటంతో అభివృద్ధి వేగంగా సాగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తదితరులు సభలో పాల్గొన్నారు. సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, రాష్ట్రంలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని ప్రధాని మోదీ అన్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం : రూ.9,449 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. కర్నూలులో రూ.2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు, రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్‌లకు, రూ.493 కోట్లతో కొత్తవలస-విజయనగరం మధ్య 4వ లైన్‌కు, రూ.184 కోట్లతో పెందుర్తి-సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.
మోదీ లాంటి నాయకుడిని చూడలేదు : చంద్రబాబు
మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదన్నారు.
25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారని తెలిపారు.మోదీ వంటి నాయకుడిని పొందడం దేశం ఎంతో అదృష్టం చేసుకుందన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరామన్నారు. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ అని, జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతంలోపు పరిధిలోకి వచ్చాయన్నారు.
దేశం కోసం పనిచేసే కర్మయోగి మోదీ : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధమైన ఫలితాలూ ఆశించకుండా దేశం కోసం పనిచేసే ఒక కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. దేశ సేవే లక్ష్యంగా ప్రధాని ముందుకు సాగుతున్నారని ఆయన ప్రశంసించారు.
కూటమి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడాలని, కనీసం 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా సమష్టిగా పనిచేస్తామని, రాబోయే తరాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.