పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి నిరంకుశ నిజాం పాలనను వణికించిన అక్షర వీరుడు షహీద్ షోయబుల్లా ఖాన్. ప్రజలకోసం కలంపట్టి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన ఈ మహాధీరుడు జర్నలిజం చరిత్రలో అసమాన స్థానాన్ని సంపాదించాడు. ఆయన జీవితం ఒక కలం యోధుడి ధైర్యానికి, నిబద్ధతకు, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. స్వేచ్ఛా భావన, న్యాయం, ప్రజా హక్కులకోసం పోరాటమే ఆయన ఆత్మ స్ఫూర్తి. 1920 అక్టోబర్ 17న ఖమ్మం జిల్లాలోని సుబ్రవేడు గ్రామంలో హబీబుల్లా ఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లా ఖాన్ జన్మించాడు. వారి కుటుంబం ఉత్తరప్రదేశ్‌నుంచి నిజాం రాష్ట్రానికి వలసవచ్చి ఇక్కడే స్థిరపడింది. బాల్యంలోనే విద్యా ప్రతిభ, చిత్రకళా నైపుణ్యంతో షోయబ్ పేరు తెచ్చుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి బిఎ, జర్నలిజం డిగ్రీలు పూర్తి చేసి, బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. తన కుమారునిలో గాంధీ పోలికలు ఉన్నాయని భావించి తండ్రి షోయబుల్లా గాంధీ అని ప్రేమతో పిలిచేవాడు. ఆ పేరుకు తగ్గట్టే షోయబ్ నిబద్ధత, ధైర్యం, నిజాయితీతో కూడిన మార్గంలో నడిచాడు.
ఆ కాలం తెలంగాణ అగ్నిగోళంలా మండుతున్న సమయం. నిజాం పాలనలో ప్రజలు ఊపిరి పీల్చలేని స్థితి. పత్రికలపై ఉక్కుపాదం. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రాణపణం. అయినా షోయబ్ వెనుకడుగు వేయలేదు. ప్రజాస్వామ్య భావాలతో, జాతీయోద్యమ స్ఫూర్తితో ఆయన జర్నలిజాన్ని తన ఆయుధంగా ఎంచుకున్నాడు. మొదటగా ఉర్దూ పత్రిక ‘తేజ్’ లో ఉప సంపాదకుడిగా పనిచేశాడు. అక్కడే ఆయన కలం అగ్నిజ్వాలలతో రగిలింది. నిజాం ప్రభుత్వ దోపిడీ, రజాకార్ల దౌర్జన్యాలను ఎండగడుతూ నిర్భయంగా రాశాడు. ఫలితంగా ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించింది. ఆ తర్వాత ఆయనకు వేదికగా ‘రయ్యత్’ పత్రిక దొరికింది ముందుముల ముల్కి నర్సింగరావు నిర్వహించిన ఈ పత్రికలో షోయబ్ స్వేచ్ఛా రాతలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి. కానీ ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం మూసివేసింది. ప్రజాహక్కుల కోసం సొంత పత్రిక అవసరమని భావించి షోయబుల్లా ఖాన్ భార్య, తల్లి నగలను అమ్మి ‘ఇమ్రోజ్’ పత్రికను స్థాపించాడు.
మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సహకారంతో ఈ పత్రిక 1947 నవంబర్ 17న తొలి సంచిక విడుదల చేసింది. ‘ఇమ్రోజ్’ అంటే ఉర్దూలో ‘ఈ రోజు’. ఈ పేరు వెనుక షోయబ్ సంకల్పం ఉంది ప్రజా స్వేచ్ఛ కోసం పోరాటం నేటి నుంచే ప్రారంభం కావాలి! ‘ఇమ్రోజ్’ సంపాదకీయాలు నిజాం పాలనను వణికించాయి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలనే ఆయన అభిప్రాయం ధైర్యంగా, స్పష్టంగా వ్యక్తమైంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా నిజాం పాలన అంతం కావాలి, హైదరాబాద్ భారతదేశంలో భాగం కావాలి అని ఆయన రాసిన పదాలు ఆ కాలంలో విప్లవ స్ఫూర్తి కలిగించాయి. షోయబ్ రాతలు కేవలం రాజకీయ విమర్శలు కాదు; అవి సామాజిక చైతన్యం కూడా. నిజాం పాలనలో బలహీన స్థితిలో ఉన్న పేద ముస్లిం కుటుంబాల బాధలను, రజాకార్ల దుశ్చర్యలను ఆయన ధైర్యంగా బహిర్గతం చేశాడు. నిజాంకు వ్యతిరేకంగా నిలబడిన ముస్లిం మేధావుల వాణిగా నిలిచాడు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టుల పోరాటాలు -అన్నింటికీ ఆయన పత్రిక వేదిక అయింది. 1948 ఆగస్టు 19న రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ సభలో షోయబ్ చేతులు నరికి వేస్తామని బహిరంగంగా బెదిరించాడు. ఆ బెదిరింపు రెండు రోజులకే వాస్తవమైంది. 1948 ఆగస్టు 21 రాత్రి -కాచిగూడ రైల్వేస్టేషన్ రోడ్‌లోని ‘ఇమ్రోజ్’ కార్యాలయంలో పని ముగించుకుని బావమరిది ఇస్మాయిల్ ఖాన్ తో ఇంటికి వెళ్తున్న షోయబ్‌పై పదిమంది రజాకార్లు దాడి చేశారు. ఆయన కలం పట్టిన కుడిచేయిని నిర్దాక్షిణ్యంగా నరికి, తీవ్ర గాయాలతో ఆయనను నేలకూల్చారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇస్మాయిల్ ఖాన్‌ను కూడా గాయపరిచారు. రక్తమడుగులో పడి కొట్టుమిట్టాడుతున్న షోయబుల్లా ఖాన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, 1948 ఆగస్టు 22 తెల్లవారుజామున ఆయన ప్రాణాలు విడిచాడు.
నిజాం సర్కారు ఆయన అంతిమ యాత్రను కూడా నిషేధించింది. అయినప్పటికీ ప్రజల ప్రేమ, గౌరవం అణగదీయలేకపోయింది. పోలీసు బందూకుల మధ్య, ప్రజల కన్నీరుతో గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో షోయబుల్లా ఖాన్ ఖననం జరిగింది. ప్రజా స్వేచ్ఛకోసం, తెలంగాణ చరిత్రలో మానవ హక్కుల స్వరంగా నిలిచిన షహీద్ షోయబుల్లా ఖాన్ జీవితం తెలుగు పత్రికా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. కలం యోధుడు, సత్యవాది, స్వేచ్ఛా ప్రియుడు -ఆయన కీర్తి కాలాతీతం. ఆయన చెప్పిన ప్రజల హక్కుల కోసం రాయడం నేరం అయితే, ఆ నేరం పునరావృతం చేస్తాను అనే స్ఫూర్తి నేటి పాత్రికేయులకు మార్గదర్శకం. అసమాన కలం యోధుడు షహీద్ షోయబుల్లా ఖాన్ ఒక పత్రికా వీరుడు, ఒక ప్రజాయోధుడు, ఒక అమర త్యాగధనుడు. జర్నలిజం ధైర్యానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన షోయబుల్లా ఖాన్ స్ఫూర్తి ప్రతి పాత్రికేయుని కలంలో వెలుగుతూనే ఉంటుంది.
రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494