మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బోగస్ ఓట్ల అంశంపై బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎలక్టోరల్స్‌ను ఇసి రివిజన్ చే స్తోందని, ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్ర స్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందంటూ అభ్యర్థి మాగంటి సునీత, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లంచ్ మోషన్ పిటిషన్ల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను గురువారం హైకోర్టు విచారించింది. బిఆర్‌ఎస్ తరఫున న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్‌లో సంబంధం లేని 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు.
ఒకే ఇంట్లో 43 మంది ఓటర్లు నమోదు అయ్యారని, బోగస్ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించినా చర్యలు తీసుకోవడం లేదని వాదించారు. ఇసి తరపున లాయర్ వాదనలు వినిపిస్తూ సుప్రీం కోర్టులో బిహార్ ఎలక్షన్లపై విచారణ నడుస్తోందని, నామినేషన్ల చివరి తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని కోర్టుకు తెలిపారు. బిఆర్‌ఎస్ రిప్రజెంటేషన్లపై ఎన్నికల అధికారిని ఆదేశించామని, నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 8 వేలు అయితే బిఆర్‌ఎస్ వాళ్లు 12 వేలు అని చెబుతున్నారని, 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని వాదన వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇప్పటికే ఎలక్టోరల్స్‌ని ఇసి రివిజన్ చేస్తోందని ఈ సమయంలో బోగస్ ఓట్లపై ఇసికి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది.