మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పెద్దల కు మంత్రి కొండా సురేఖ మధ్య తలెత్తిన వివా దం, 24 గంటల పాటు కొనసాగిన హైడ్రామాకు ఎట్టకేలకు గురువారం సాయంత్రం తెరపడింది. మంత్రివర్గ సమావేశానికి గైర్హాజర్ అయిన మం త్రి కొండా సురేఖ అదే సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో ఎమ్మెల్యే క్వార్టర్‌లో మూడు గంటలపాటు సుదీర్ఘంగా భేటీ అ య్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కొండా సురేఖ అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ఇక ఈ అంశాన్ని పార్టీ పెద్దలకు వదిలేసినట్టు ప్రకటించారు. పార్టీలో, ప్రభుత్వంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలు, తనకు జరుగుతోన్న అవమానాలను అన్నింటిని పార్టీ పెద్దలకు వివరించానని, పరిష్కరిస్తామని వారు హామీ లభించడం తో ఇక ఆ బాధ్యతను వారికే వదిలేసి ఇక ఈ వివాదానికి స్వస్తి పలుకుతున్నట్టు కొండా సురేఖ ముక్తసరిగా మీడియాకు చెప్పి వెళ్లిపోయారు. దీంతో బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల పాటు కొనసాగిన హైడ్రామా ప్రస్తుతానికి టీకప్పులో తుఫానుగా ముగిసిందని చెప్పవచ్చు.
మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్‌డిగా పని చేస్తోన్న సుమంత్ అనే వ్యక్తి, హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న దక్కన్ సిమెంట్ కంపెనీ యాజమానిని తుపాకీతో బెదిరించి డబ్బులు అడిగినట్టు ప్రభుత్వానికి ఫి ర్యాదు అందింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే ఈ ఫిర్యాదు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సుమంత్‌ను ఉద్యో గం నుంచి తొలిగించడం, ఆ విషయాన్ని మంత్రి సురేఖకు ముందుగా తెలపకపోవడం, పైగా సు మంత్ కోసం గాలిస్తున్న పోలీసులకు అతను మం త్రి ఇంట్లో నివాసంలో తలదాచుకున్నడాన్న సమాచారంతో మఫ్టీ పోలీసులు అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మంత్రి సురేఖ కూతు రు సుస్మిత, ముఖ్యమంత్రి, ఆయన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒకే సామాజికవర్గానికి చెందిన వారు బీసీ అయిన తన తల్లిని (మంత్రి సురేఖ) వేదిస్తున్నారని సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది.
తప్పు చేస్తే చర్య తీసుకొండి&కనీసం తనకు చెప్పాలి కదా?
‘తన ఓఎస్‌డి సుమంత్ పారిశ్రామికవేత్తలను బెదిరించినట్టు ఆధారాలు ఉంటే, అతను తప్పు చేస్తే చర్య తీసుకొండి, తనకేలాంటి అభ్యంతరం లేదు. కానీ తన ఓఎస్‌డిని తొలగించే ముందు తనకు ఓ మాట చెప్పాలి కదా?’అని మంత్రి కొండా సురేఖ పార్టీ పెద్దల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి సురేఖ, ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసిన సురేఖ కూతురు సుస్మీతా గురువారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తనకు తెలియకుండా తన వద్ద పనిచేసే ఉద్యోగిని తొలగించడం అవమానం కాదా? తన స్థానంలో ఇంకేవ్వరున్నా ఏ విధంగా స్పందిస్తారో చెప్పండి’అని ఆమె ప్రశ్నించినట్టు తెలిసింది. తనకు జరిగిన అవమానం కారణంగానే మంత్రివర్గ సమావేశానికి వెళ్లాలనిపించలేదని, తన కూతురు ఆవేశానికి కారణం కూడా ఇదేనని సురేఖ వివరించినట్టు తెలిసింది. తాను నిర్వహిస్తోన్న దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే మేడారం జాతర పనులు, టెండర్లు, ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోక్యం, తనకు ఆహ్వానం లేకుండానే అధికారులతో మేడారం జాతర పనులపై సమీక్ష నిర్వహించడం తదితర విషయాలను కూడా ఆమె వివరించినట్టు తెలిసింది.
సమస్య ఏదైనా ఉంటే, పార్టీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలి తప్ప, ఇలా ప్రభుత్వ పెద్దలపై బాహాటంగా ఆరోపణలు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, పైగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు అస్త్రం అందించినట్టు అవుతుందని మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్ గౌడ్ తప్పు పట్టినట్టు తెలిసింది. ఈ వివాదంపై తాను బయట ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పడంతో ఆమె కూతురు సుస్మీతా చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేయగా, తన తల్లికి అవమానం జరిగిందన్న ఆవేదనతో అలా మాట్లాడిందని, వాటిని పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దని, చిన్న పిల్ల ఏదైనా తప్పుగా మాట్లాడితే అందుకు విచారం వ్యక్తం చేస్తోన్నట్టు సురేఖ చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం.
కమ్యూనికేషన్ గ్యాప్&సమిసిపోతుంది : మహేశ్‌కుమార్
మంత్రి కొండా సురేఖ వివాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ వివాదం తలెత్తిందని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రివర్గ సమావేశానికి గైర్హాజర్ కావడం, పైగా ప్రభుత్వ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ వద్దకు మంత్రి సురేఖ వెళ్లడంతో, ఆవేశంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే, ఈ వివాదం మరింత పెద్దది అవుతుందని, తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి సురేఖతో మాట్లాడాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ అధిష్టాన పెద్దల సూచనతోనే మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ రంగంలోకి దిగినట్టు పార్టీ వర్గాల సమాచారం. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తొందరపడకూడదని, కొంత సంయమనం పాటించక తప్పదన్న అభిప్రాయం పార్టీ, ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేయడం వల్లనే, ఈ వివాదానికి ఇంతటితో స్వస్తి పలికినట్టు తెలిసింది. కాగా ప్రభుత్వానికి ఇంకా మూడేండ్ల పదవికాలం ఉండటం, పైగా తన సామాజిక వర్గం నేపథ్యంలో తన పదవికి ముప్పు తెచ్చుకోకుండా ప్రస్తుతానికి ఈ వివాదానికి ఇంతటితో తెరదించడం మంచిది, ప్రస్తుత పరిస్థితులలో తెగేవరకు లాగవద్దని అనుకుంటున్నట్టు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మరళి వరంగల్‌లో తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
౦౦౦౦