నేడు కొత్త మంత్రి మండలి
పాతవారికి చాలా మందికి షాక్‌లు
అహ్మదాబాద్ ః ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాల రాజకీయ కేంద్ర బిందువు గుజరాత్‌లో శుక్రవారం రాష్ట్ర మంత్రిమండలి భారీ ప్రక్షాళన జరుగనుంది. ఈ క్రమంలో మంత్రుల తీసివేతలు, కొత్తవారిని తీసుకోవడం కోసం ఒక్కరోజు క్రితం గురువారం మంత్రులంతా తమ రాజీనామాలు సమర్పించారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి మండలిలో 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ సంఖ్యను ఇప్పుడు 26కు విస్తరిస్తారు. ఇప్పుడున్న వారిలో ఐదుగురు లేదా ఆరుగురు పదవులు పదిలంగా ఉండవచ్చు. మిగిలిన వారిపై వేటేసి, వారికి బదులుగా కొత్త ముఖాలను తీసుకుంటారని వెల్లడైంది.
శుక్రవారం నాటి మంత్రివర్గ పునర్వస్థీకరణకు రంగం సిద్ధం అయిందని బిజెపి సీనియర్ నేత ఒకరు తెలిపారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహాయిస్తే మిగిలిన మంత్రులు రాజీనామాలకు దిగారు. కొత్త మంత్రులతో కూడిన జాబితాతో ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలుసుకోనుండటం కీలక పరిణామం అయింది. శుక్రవారం ఉదయం 11.30కి గుజరాత్ నూతన కేబినెట్ ప్రమాణస్వీకారం స్థానిక మహాత్మా మందిర్ వద్ద జరుగుతుంది. హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా ఈ కార్యక్రమానికి వస్తారు. ఆకస్మికంగా గుజరాత్‌లోని బిజెపి మంత్రిమండలి ప్రక్షాళనకు దారితీసిన కారణాలు వెలుగులోకి రాలేదు. అయితే పనితీరు, నిర్ణీత లక్షాల సాధనలో ఛేదనలో విఫలం అయినందునే వేటు పడిందనే ప్రచారం జరుగుతోంది. గురువారం ఉదయమే ముఖ్యమంత్రి నివాసంలో మంత్రుల సమావేశం జరిగింది. పార్టీ కేంద్ర నాయకత్వం చెప్పినందున తాము కేబినెట్‌ను మార్చివేస్తున్నామని, మంత్రులంతా ముందు రాజీనామాలు చేయాల్సి ఉంటుందని వారికి ఆయన తెలిపారు. వెంటనే వారు అంగీకరించారు. రాజీనామాలు అందించారు.
ఈ క్రమంలో పదవులు ఇక పోతున్నాయనే నిర్థారణ అయిన వారు చాలా మంది తెల్లముఖాలు వేశారు. మంత్రిపదవుల ఆశలపై ఉన్న వారిలో ఉత్సాహం నెలకొంది. సిఎం నివాసంలో జరిగిన సమావేశానికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ కూడా హాజరయ్యారు. బిజెపికి గుజరాత్ అత్యంత కీలకమైన రాష్ట్రం అయినందున కేబినెట్‌లో కులాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం సరిగ్గా ఉండేలా చేసుకునేందుకు ఈ విన్యాసానికి దిగినట్లు గుజరాత్ బిజెపి అధ్యక్షులు జగదీష్ విశ్వకర్మ తమ సందేశం వెలువరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
2027 చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి మరింత పట్టు సాథించుకునేందుకు మంత్రి మండలి కొత్త రూపానికి దిగినట్లు భావిస్తున్నారు. అయితే మరి ఇంత ముందుగానే ఇంతటి షాక్ అవసరం లేదని, ఇప్పటి చర్యకు వేరే కారణాలు ఉండి ఉంటాయని స్థానిక ఆప్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.