రాష్ట్రంలోని వరంగల్ శివార్లలో ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ద్వారా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేస్తూ అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు విమానాశ్రయం అభివృద్ధి కోసం మొత్తం 280.30 గుంటల భూమిని సేకరించడానికి గతంలోనే అనుమతులు మంజూరు చేశారు. 2024 నవంబర్ 17న జారీ చేసిన జీఓ 43 ద్వారా భూసేకరణ కోసం రూ.205 కోట్లు మంజూరు చేస్తూ వరంగల్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
అయితే, విమానాశ్రయ భూసేకరణకు సంబంధించి అవార్డును ఖరారు చేయడానికి, భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లించడానికి ఇప్పటికే మంజూరు చేసిన రూ.205 కోట్లతో పాటు అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం భూసేకరణ నిమిత్తం అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియను త్వరగా ముగించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో మొత్తం భూసేకరణ కోసం మొత్తంగా రూ.295 కోట్లు మంజూరయ్యాయి. ఈ విమానాశ్రయం అభివృద్ధి కోసం కన్సల్టెన్సీ సేవలను అందించడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్టెంట్‌గా నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది.