గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూ సేకరణ జరిపిందని, అసైన్డ్ భూములకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా రైతులను బెదిరించి భూమిని సేకరించిందని టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం అన్నారు. నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం అక్రమంగా అసైన్డ్ భూములను సేకరించిందని, ఆ సేకరణకు వ్యతిరేకంగా రైతుల పక్షాన తెలంగాణ జనసమితి న్యాయ పోరాటం చేసి గెలించిందన్నారు. ప్రభుత్వం ఈ తీర్పును అమలుపరిచి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోదండరాం కోరారు. తెలంగాణలో రైతుల పక్షాన తెలంగాణ జన సమితి ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఉయ్యాలవాడకు చెందిన దళిత రైతుల భూమిని ప్రభుత్వం అక్రమ పద్ధతులలో బెదిరించి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా తీసుకుందని, ఈ విషయంపై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆ భూమిపై సర్వహక్కులు రైతులకు ఉన్నాయని, వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించిందన్నారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధారసత్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశపాక శ్రీనివాస్, ఈ కేసులను వాదించిన న్యాయవాది మాధవరం రామేశ్వరరావు గురువారం టిజెఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంను కలిసి తమ పక్షాన నిలబడి, న్యాయ పోరాటానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.