వరంగల్: మంత్రి కొండా సురేఖ మాజీ ఒఎస్‌డి సుమంత్ విషయం తనకు తెలియదని కాంగ్రెస్ నేత కొండా మురళీ తెలిపారు. కొండా సురేఖ, తన కూతురు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రావడంపై మురళీ స్పందించారు. తన కూతురు, అల్లుడు లండన్‌లో ఉన్నారని, అక్కడ వ్యాపారం చేస్తున్నారన్నారు. తన బిడ్డకు పదవి ఏమీ లేదని, ఏ పార్టీలోనూ లేదన్నారు. భద్రతా కారణాల దృష్టా తాను, కొండా సురేఖ వేర్వేరు కార్లలో ప్రయాణి చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ సిఎం కావాలని తాను, సురేఖ కష్టపడ్డామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఎంఎల్‌సి పదవి ఇస్తామని మాట ఇచ్చారని, సిఎం రేవంత్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన ఇంటికి వచ్చారన్నారు. మంత్రులు అందరి ఇండ్లకు వెళ్లి మాట్లాడే పరిచయాలు తనకు ఉన్నాయన్నారు. తనని ఎందుకు లక్ష్యం చేసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తన సమస్యను పరిష్కరించుకుంటానని వివరణ ఇచ్చారు. ఎవరి తప్పు ఉన్నా సమస్యకు పరిష్కారం జరిగేలా చూస్తానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మినాక్షీ నటరాజన్ తనని మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పారని, మళ్లీ మినాక్షీతో అన్ని విషయాలు మాట్లాడిన తరువాత ఆమె చెప్పినట్లు వింటానని స్పష్టం చేశారు. సుమంత్ కోసం పోలీసులు రావడంతో వారిని మంత్రి కూతురు సుష్మిత అడ్డుకున్న విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ నాయకులు, మంత్రులతో పలు వివాదాలు ఉన్న నేపథ్యంలో ఆమెను పదవి నుంచి తొలగించనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.