దీపావళి అంటే రంగురంగుల వెలుగుల పండుగ. కన్నుల విందుగా కనిపించే ఈ పండగ ముఖ్యంగా పిల్లలకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఈ పండగ సందర్భంగా బాణాసంచా కాల్పులతో కోరలుచాచే వాయు కాలుష్యం ప్రజలను తీవ్ర అస్వస్థులుగా చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సిఆర్, హర్యానా ప్రాంతాల్లో ఒకవైపు పంట వ్యర్థాల దగ్ధాలతో వాయు కాలుష్యం పెరుగుతుంటే ఈ దీపావళి వచ్చే సరికి వాయు కాలుష్యం మరింత కమ్ముకుని రావడం ఏటా తీవ్ర సమస్యగా తయారవుతోంది. ఈ ఏడాది దీపావళి ఇంకా రాకముందే ఢిల్లీ తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలకు చేరుకోవడం గమనార్హం. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ క్యాస్టింగ్ అండ్ రీసెర్చి నివేదిక ప్రకారం గాలి నాణ్యత స్థాయి బాగా క్షీణించిందని వెల్లడైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) 0100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని సూచిక. గాలి నాణ్యత 447 కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. బుధవారం ఉదయానికే ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 300 పాయింట్లు దాటిందంటే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నోయిడాలో 369, ఘజియాబాద్‌లో 325, ఫరీదాబాద్‌లో 267 పాయింట్లలో వాయు నాణ్యత క్షీణత నమోదైంది. వాయు నాణ్యత సూచిక ప్రకారం బుధవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణత 300 పాయింట్లు దాటింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల సమయానికి నోయిడాలో నాణ్యత సూచిక 369 కాగా, ఘజియాబాద్‌లో 320 325 మధ్య నమోదయ్యాయి. గాలిలో కాలుష్య రేణువులు ప్రతి ఘనపు మీటర్ పరిమాణంలో ఏ స్థాయిలో ఉన్నాయో లెక్కగట్టి పరిశీలిస్తేనే కాలుష్య స్థాయి తెలుస్తుంది. దీనిని పర్టిక్యులేట్ మాటర్ అంటే పిఎంగా పరిగణిస్తారు. గత ఏడాది దీపావళి రోజున దేశంలోని అనేక నగరాల్లో అత్యధిక స్థాయిలో కాలుష్య రేణువుల (పిఎం) స్థాయిలు నమోదయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, లక్నో, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, తదితర ఏడు నగరాల్లో గంటగంటకు కాలుష్య స్థాయిలు పెరిగిపోయాయి. ప్రతి ఘనపు మీటర్ పరిమాణంలో 500 మైక్రోగ్రాముల వంతున కాలుష్య స్థాయిలు దాటిపోయాయి. దీపావళి రోజున, టపాసులు, బాణాసంచాల కాల్పులే ఈ కాలుష్య స్థాయిలు పెరిగిపోవడానికి కారణమైందని పరిశోధకులు వెల్లడించారు. 2016లో పుణెకు చెందిన ది చెస్ట్ రీసెర్చి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దీపావళి రోజున బాణాసంచా నుంచి వెలువడే పిఎం 2.5 కాలుష్య రేణువుల మొత్తాన్ని కొలవడానికి ప్రయోగాలు నిర్వహించింది.
పాము మాత్ర పటాకుల నుంచి అత్యధిక స్థాయిలో 2.5 మైక్రాన్ల వ్యాసంలో 64,500 పిఎం కాలుష్య రేణువులు విడుదల అవుతున్నాయని వెల్లడించింది. గత ఏడాది ఉత్తరాది నగరాల్లో దీపావళి రోజున కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. దీపావళి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఈ ప్రభావం కనిపించింది. దీపావళి రోజున ఇతర రకాల కాలుష్య కారకాలు కూడా రికార్డు స్థాయిని అధిగమించాయి. కార్బన్ మోనాక్సైడ్, అట్మాస్ఫియరిక్ అమ్మోనియా, నైట్రస్ ఆక్సైడ్, నైట్రొజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు రికార్డు స్థాయిని దాటడం విశేషం. ఢిల్లీలో సాధారణంగా 80 వరకు కాలుష్య స్థాయిల పరిమితి ఉంటుంది. కానీ గత ఏడాది దీపావళి రోజున 140 వరకు కాలుష్య రేణువుల స్థాయిలు కనిపించాయి. సల్ఫర్‌డైయాక్సైడ్ స్థాయిల ప్రభావంతో గుండె జబ్బుల రోగులు ఆస్పత్రుల్లో అత్యధికంగా చేరవలసి వచ్చింది. వాయు కాలుష్యానికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధం ఉంది. గుండెపోటు, పక్షవాతం, ఇవి కాక మరికొన్ని ప్రమాదకరమైన వ్యాధులకు కూడా దారి తీయవచ్చు. కేవలం వాయు కాలుష్యం వల్లనే 2019 లో దాదాపు 1.67 మిలియన్ మంది అకాల మరణాలకు బలయ్యారని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ప్రపంచం మొత్తం మీద అత్యంత కాలుష్య 20 నగరాల్లో 14 ఉత్తర భారతం లోనే ఉన్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వాయు నాణ్యత క్షీణించడం కేవలం ఢిల్లీకే పరిమితం కాదు. ఏటా ముఖ్యంగా శీతాకాలంలో ఇండో గంగాటిక్ మైదాన ప్రాంతంలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో చేరుకోవడం పరిపాటిగా వస్తోంది. ఢిల్లీలో కాలుష్యానికి గత ఏడాది ఆప్ ప్రభుత్వమే కారణమని బిజెపి ఆరోపించింది. ఈ ఏడాది బిజెపి ప్రభుత్వమే ఢిల్లీలో ఉన్నా కాలుష్యం మితిమీరడానికి ఎవరు బాధ్యులు అన్న వివాదం ఎదురవుతోంది. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో దీపావళి రోజున బాణాసంచా కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు అనేక ఆంక్షలు విధించినా, అనేక అభ్యర్థనలతో చివరకు గ్రీన్ కాకర్స్‌కు అనుమతించింది. ఐదేళ్లపాటు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ కాకర్స్ వెలిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్‌ఐఆర్), నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్( ఎన్‌ఇఇఆర్‌ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజులో రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ బూడిద వాడకుండా, తయారు చేసే బాణాసంచాను గ్రీన్ కాకర్స్‌గా పిలుస్తారు. హానికరమైన రసాయనాలు ఇందులో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30శాతం తక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ కాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) అనుమతి ఇచ్చింది. మరి దీని ప్రభావం దీపావళి రోజున ఎలా ఉంటుందో చూడవలసిందే.