ఆహారం మనిషి జీవితానికి ప్రాణాధారం. ప్రాచీన కాలంలో ఆహారం అంటే జీవనవిధానం, ఆరోగ్యం, సంస్కృతి, ఆధ్యాత్మికత అన్ని కలసిన సమగ్ర దృక్కోణం. కానీ నేడు ఆహారలేమి, పోషకాహార లోపం, శూన్యపుటాకలి, ఆకలివిపత్తు, ఆహారపు వృథా అనేవి ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆహార సమస్యలు. ప్రపంచ వ్యాప్తంగా 78 కోట్లమంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని 190 కోట్ల మందికి సురక్షితమైన పోషకాహారం అందుబాటులో లేదని, 14 కోట్ల మంది పిల్లలు పోషకాహర లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలో కల్తీ ఆహారం కారణంగా ప్రతి ఏటా 10 కోట్ల మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందులో 70 వేల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల పేర్కొంది. అందరికీ ఆహారం లక్ష్యసాధన కోసం ఐక్యరాజ్యసమితి ఆహార- వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) వ్యవస్థాపక దినం 1945 అక్టోబర్ 16వ తేదీని ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరపాలని యుఎన్‌ఒ సభ్యదేశాలు నిర్ణయించాయి. 1981లో మొదటిసారిగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం.
2024 లో మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరికీ ఆహారపు హక్కు అనే నినాదంతో జరుపుకున్నాం. ఈ సంవత్సరం ‘మంచి ఆహారం మెరుగైన భవిష్యత్తు కోసం చేయిచేయి కలుపుదాం’ అనే ఇతివృత్తంతో వరల్డ్ ఫుడ్ ఫోరం- 2025 సమావేశాలు అక్టోబర్ 10- 17 తేదిలలో ఇటలీలోని రోమ్ నగరంలో జరుగుతున్నవి. ఇందులో బెటర్ ఫుడ్- బెటర్ ఫ్యూచర్ లక్ష్య సాధనకు బెటర్ ప్రొడక్షన్ బెటర్ న్యూట్రిషన్ బెటర్ ఎన్విరాన్‌మెంట్, బెటర్ లైఫ్ అను నాలుగు శాఖల ద్వారా ఆహార వ్యవస్థలను మెరుగుపరచవచ్చునని పేర్కొన్నారు. ఆహారం కేవలం అవసరం మాత్రమే కాదు ప్రతి వ్యక్తి హక్కు అని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరుగుదల అధికంగా ఉండే అవకాశం ఉంది. త్వరితగతిన మారుతున్న వాతావరణ సామాజిక ఆర్థిక అసమతుల్యతల వల్ల, భూతాపం, వరదలు, ఉక్రెయిన్ రష్యా వంటి యుద్ధాలు, ఎల్‌నినో- లానినా పరిస్థితులు జీవవైవిధ్యనష్టం, ఆహారపు గొలుసుల విచ్ఛిన్నం వంటి కారణాలతో సమీప కాలంలో అనూహ్య రీతిలో ఆహారసమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన దేశంలో గత కొన్నేళ్లుగా రుతుపవనాలు సహకరించటం వల్ల ఆహారదినుసుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. 2021 -22 లో 316 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంచనాలను అధిగమించింది. అలాగే నూనెగింజలు, పప్పుధాన్యాలు ఉద్యానవన ఉత్పత్తులు కూడా పెరిగాయి. పంటల ఉత్పత్తి పెంపుకు కేంద్రప్రభుత్వం మిల్లెట్స్‌మిషన్, పల్స్‌రెవల్యూషన్ పిఎం కిసాన్, పిఎం పోషణ్, పిఎం గరీబ్ అన్నయోజన వంటి పథకాలను బలోపేతం చేసి 2030 నాటికి ఆహారోత్పత్తి 20% పెంపు లక్ష్యంగా పెట్టుకొని ఆరోగ్యవంతమైన, సుస్థిరమైన, స్వావలంబన భారతదేశం దిశగా ముందుకు సాగుతోంది. ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించటానికి జాతీయ ఆహార భద్రతా చట్టం -2013ను తెచ్చింది. ఆహార లభ్యత ఆహార అందుబాటు ఆహార వినియోగం, ఆహార స్థిరత్వం అను నాలుగు అంశాలు ఈ చట్టంలోని ముఖ్యఅంశాలు. దేశజనాభాలో మూడింట రెండువంతుల మందిని ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చింది. రాష్ట్రంలోనూ 2017లో తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర జనాభాలో 75% గ్రామీణ జనాభాను, 50% పట్టణ జనాభాను ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చింది.
స్థూలంగా ఈ చర్యల వల్ల దేశంలో ఆహార భద్రత బాగా మెరుగుపడింది. భారతీయుల ఆహారపు అలవాట్లు అత్యంత ఉత్తమమైనవని ప్రపంచ దేశాలు భారత్‌ను అనుసరిస్తే 2050 నాటికీ పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని మన ఆహార వియోగం తీరు గురించి ఇటీవల వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్‌కు చెందిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ -2024 అభిప్రాయపడటం గమనార్హం. వ్యవసాయంలో అధునాతన సాంకేతికతలను వినియోగించాలి. ఆహార నిల్వకు కోల్డ్ స్టోరేజ్, సరఫరా చక్రంను బలోపేతం చేయాలి. చెట్ల పెంపకం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. ఆహార వ్యర్థం ఆహార వృథాలను అరికట్టాలి. ధనవంతులు ఆహారాన్ని వృథా చేయకుండా పేదవారితో పంచుకోవటం ద్వారా ఆకలితో ఉన్నవారి సంఖ్యను తగ్గించవచ్చును. ఆహారాన్ని జాగ్రత్తగా వినియోగించడం, అంగీకరించడం, గౌరవించడం అత్యంత అవసరం.
భారత రవీందర్, 99125 36316