న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఆరు జిల్లాలో ప్రాబల్యం చాటుకున్న నక్సలిజం ఇప్పుడు కేవలం మూడు జిల్లాలకు పరిమితం అయిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. మల్లోజుల, ఆయన బృందం సరెండర్ తరువాత బుధవారం ఈ స్పందన వెలువడింది. ఇప్పుడు కేవలం బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్ జిల్లాలో నక్సల్స్ ఉనికి ఉందని ప్రకటనలో తెలిపారు. ఎల్‌డబ్లుఇ కథ ముగిసేదశకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. నక్సల్స్ రహిత భారత్ రూపొందించాలనే మోడీ ప్రభుత్వ విజన్ దిశలో ఇది భారీ ముందడుగు అని, తమ 2026 లక్షం ముందే దీనిని చేరుకుంటామని అధికారిక ప్రకటనలో తెలిపారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో తాము 2026 మార్చి 31కు ముందే అనుకున్న లక్షం చేరుకుంటామని ప్రకటనలో వివరించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 312 కేడర్స్ నిర్మూలన జరిగింది. ఇందులో మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి, 8 మంది వరకూ పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. దాదాపుగా 836 మంది అరెస్టు అయ్యారు. 1639 మంది సరెండర్ అయ్యారని లెక్కలు తెలిపారు. ఇప్పుడు మల్లోజుల లొంగుబాటుతో ఇది కీలకమ లుపు తిరిగిందన్నారు.
భూపతి సరెండర్‌తో సరికొత్త అధ్యాయం: ఫడ్నవిస్
మల్లోజుల సరెండర్, వెంట భారీ స్థాయిలో నక్సల్స్ లొంగుబాట కీలక పరిణామం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం తెలిపారు. ఈ పరిణామంతో మహారాష్ట్రలో నక్సల్స్ కదలికలు ఉండబోవని ఆయన విశ్లేషించారు. ఇక కొద్దిరోజుల్లోనే చత్తీస్‌గఢ్, తెలంగాణాల్లోని మొత్తం ఈ ఎర్ర ప్రాంగణం లేదా రెడ్ కారిడార్ కథ కంచికి అని వ్యాఖ్యానించారు. నిషేథిత వర్గాలపై పోరులో తమ మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రధాన పాత్ర వహించడం తమ ప్రాంతానికి గర్వకారణం అని కూడా తెలిపారు.
జనజీవన స్రవంతిలోకి వచ్చే నక్సల్స్‌కు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఆశ్రమం, పునరావాసం కల్పిస్తాయని, నాయకత్వం లేని తమ ఉద్యమం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటకి రావాలని కూడా ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. సీనియర్ మావోయిస్టు నేత భూపతి తమ దళం సభ్యులు దాదాపుగా 60 మందితో కలిసి బుధవారం మహారాష్ట్ర సిఎం ముందు లొంగిపోయారు. ఈ దశలో ఏర్పాటు అయిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తమ ముందు నక్సల్స్ లొంగిపోయారని, వారికి చెందిన ఎకె 47లు ఇతర మొత్తం 54 మారణాయుధాలను స్వాధీనపర్చుకున్నామని ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
దేశంలో నక్సలిజం పూర్తి స్థాయి అంతానికి తమ మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఆరంభం జరిగిందని, ఇది దేశ చరిత్రలో మైలురాయి అవుతుందని ఫడ్నవిస్ గర్వగా తెలిపారు. ఇప్పుడు ఇక చత్తీస్‌గఢ్, కొంతలో కొంత తెలంగాణలోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కేవలం వారి ఉనికి పరిమితం అయింది. ఇది కూడా అంతరిస్తుందన్నారు. ఇది పోలీసు, భద్రతా సిబ్బంది, ప్రత్యేకించి ఇంటలిజెన్స్ వర్గాల ఘనత అన్నారు.