బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడాన్ని నిరసిస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపునకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మద్దతు పలికారు. బుధవారం బిసి జెఎసి నాయకుడు, బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, గుజ్జ కృష్ణ తదితరులు పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును కలిసి తమ బంద్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బంద్‌కు మద్దతు పలికారు. బిసిలకు న్యాయం జరగాలని డిమాండ్‌తో బిసి జెఎసి చేపట్టిన ఉద్యమానికి పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. బిసిల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు.
బిసి సమాజ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు.బిజెపి మాత్రమే బిసిలకు న్యాయం చేయగలదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బిసిలను మోసం చేసిందని, రిజర్వేషన్లు అమలు చేయలేక ఇతరులపై నెపం వేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసిలకు గౌరవం ఇచ్చిన పార్టీ తమదేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బిసిలు ఉన్నారని ఆయన వివరించారు. బిసిలకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కొనసాగించాలని ఆయన బిసి సంఘాలను కోరారు. బిసి సంఘాలు ఇచ్చిన బంద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాంచందర్ రావు కోరారు.