న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి దీపావళికి పర్యావరణ హిత బాణసంచా ( గ్రీన్‌క్రాకరీ) కాల్చడానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తి వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం తమ రూలింగ్ వెలువరించింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో ఈ నెల 18 నుంచి 21 వ తేదీ వరకూ పటాకులు కాల్చడానికి కొన్ని షరతులను విధించింది. దివాలీ వేడుకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా చేసుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే ఖచ్చితంగా గ్రీన్‌క్రాకరీస్‌ను కాల్చాల్సి ఉంటుంది.
అంతేకాకుండా నిర్ణీత వేళలను కూడా ఖరారు చేశారు. ఢిల్లీ, పరిసరాలలో వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలతో ఇప్పటివరకూ ఎటువంటి పటాకులు పేల్చడాన్ని అనుమతించడం లేదు. వీటిపై ఉన్న నిషేధాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సడలించింది. తాము ఈ విషయంలో మధ్యస్థ సమతూకతను పాటించి ఆదేశాలను వెలువరించామని, ఒక పరిమిత మోతాదులో బాణాసంచ కాల్చడానికి అనుమతిని కల్పించాం.
ఇక ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీకి రావడం లేదని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ తెలిపారు. దివాళి రోజు తరువాతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ, తిరిగి రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాల్సి ఉంటుంది. ఇక దుకాణాలలో అనుమతించిన సరుకు క్యూఆర్ కోడ్ ఉన్నవే విక్రయించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు విభాగంపై ఉంటుంది. ఇందుకోసం తగు విధంగా పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాలి. నిబందనలను అంతా పాటించేలా చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.