కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో లక్షల ఓట్లను తొలగించి ఓటు చోరీకి పాల్పడిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఓటు చోరీ ర్యాలీ నిర్వహించి..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి దేశవ్యాప్తంగా ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని దేశవ్యాప్తంగా తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉద్యమిస్తూ.. ప్రజలను చైతన్యం చేస్తూ ఆధారాలతో సహా బయటపెట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాలలో దొంగ ఓట్లను నమోదు చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని విమర్శించారు.
ఓట్‌చోరీపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణకు ఆదేశించే పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలు చేపడుతూ స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఇంట్లో ఓటు ఉందో లేదో చూడాలని హితవు పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ కేడం లింగమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, బోలిశెట్టి శివయ్య, అక్కు శ్రీనివాస్, కోమటి సత్యనారాయణ, బంక చందు, చిత్తారి రవీందర్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.