ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ సరిహద్దులు పరస్పర కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. తాజాగా జరిగిన ఘర్షణల్లో రెండు పక్షాలకు చెందిన సైనికులు డజన్ల సంఖ్యలో చనిపోయారు.ఇటీవల కాలంలో రెండుదేశాల మధ్య సరిహద్దు పోస్ట్ ల విధ్వంసకాండ సాగుతోంది. మంగళవారం జరిగిన ఘర్షణల్లో చాలా ప్రాణనష్టం జరగడంతో పరస్పరం నిందిచుకుంటున్నాయి. శాంతి చర్చలకు పాకిస్తాన్ మంత్రులను అనుమతించేందుకు ఆఫ్ఘనిస్తాన్ నిరాకరించింది. దీంతో ఘర్షణల నివారణకు ఆఫ్ఘన్ తో చర్చలకు మధ్య మధ్యవర్తిత్వం వహించవలసిందిగా పాకిస్తాన్ కతార్, సౌదీ అరేబియాలను వేడుకుంటోంది.ఆఫ్ఘన్ మంత్రి భారత పర్యటన పై అక్కసుతో ఉన్న పాక్ ఇదే సమయంలో డ్రోన్లు, వైమానిక దాడులకు కాందహార్ ప్రావిన్స్ పై విరుచుకుపడడంతో ఇప్పట్లో ఉద్రిక్తతలు సద్దుమణిగే అవకాశాలు కన్పించడం లేదు. పాకిస్తాన్ గతవారం కాబూల్ లోని తెహ్రీక్ – ఇ- తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) శిబిరాలను టార్గెట్ చేస్తూ, పాక్ దాడులు చేసిన తర్వాత మొదలైన పరస్పర దాడులు సద్దుమణగలేదు. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య ఈ స్థాయిలో సాయుధ ఘర్షణలు జరగడం ఇదే ప్రథమం.
కాందహార్ ప్రావిన్స్ లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో మంగళవారం భారీ ఆయుధాలతో విరుచుకుపడడంతో పాక్ కొత్త యుద్ధానికి తెరలేపిందని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆరోపించారు. ఈ కాల్పుల్లో 15 మంది పౌరులు చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు.వారిలో మహిళలు పిల్లలే ఎక్కువ. ఆఫ్ఘన్ జరిపిన ప్రతీకార దాడుల్లో పెద్ద సంఖ్యలో పాక్ సైనికుల మృతి, పాక్ ఆయుధాలు, సెర్బియా నుంచి పాక్ కొనుగోలు చేసిన టూ-55 ట్యాంక్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ యోధులు. వీడియో విడుదల.మరో పక్క తమ నైరుతి, వ్యాయవ్య ప్రాంతంలో రెండు పోస్ట్ లపై తాలిబన్ల దాడిని తిప్పికొట్టామని ఈ సందర్భంగా 30 మంది, స్పిన్ బోల్డాక్ సమీపంలో 20 మందిని హతమార్చినట్లు పాక్ ప్రకటించింది. కాందహార్ లో పాక్ వైమానిక దాడులు జరిపింది. గతవారంలో తాలిబన్లు డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్ దళాలపై పెద్దఎత్తునదాడి చేసి 58 మంది పాక్ సైనికులను చంపివేశారు. 20 పాక్ భద్రతా స్థావరాలను ధ్వంసం చేశారు.