రంజీ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నమెంట్‌ని సెంచరీతో ప్రారంభించాడు యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జార్ఖండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఐదో స్థానంలో బరిలోకి దిగిన కిషన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో సెంచరీ (101) చేశాడు. ఇషాన్‌తో పాటు బ్యాటింగ్ చేస్తున్న మరో ఆటగాడు సాహిల్ రాజ్ కూడా అర్థశతకం సాధించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్ 90 ఓవర్లలో 307 పరుగులు చేసింది. క్రీజ్‌లో కిషన్ (125), రాజ్ (64) ఉణ్నారు.
అంతకు ముందు జార్ఖండ్ ఇన్నింగ్స్‌లో శిఖర్ మోహన్ 10, శరన్‌దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలింగ్‌లో గుర్జప్నీత్ సింగ్ 3, డిటి చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ 1 వికెట్ తీశారు.