అమరావతి: డబులు ఇంజిన్ సర్కార్ విధానాలతో ఎపికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర సహకారంతో ఎపికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలపై సిఎం టెలీకాన్ఫరెన్స్ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గూగుల్ డేటాహబ్ రావడంతో ప్రధాని, కేంద్రమంత్రులు చొరవ ఉందని, గూగుల్ రావడానికి మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని తెలియజేశారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకొచ్చిందని, దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చంద్రబాబు పేర్కొన్నారు. గత పాలకులు చేసిన విధ్వంసంతో ఎపి తీవ్రంగా నష్టపోయిందని, గత పాలకుల తప్పులను సరిచేసేందుకు చాలా సమయం పట్టిందని అన్నారు.
యోగాంధ్ర, అమరావతి రీసార్ట్ కార్యక్రమాలను విజయవంతం చేశామని, ఇప్పుడు ప్రధాని పాల్గొనే సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్స్ ను సక్సెస్ చేద్దాం అని కేంద్రమంత్రులకు సూచించారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నామని, గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. తిరుపతి, శ్రీశైలం, గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని, హైల్తి, వెల్తి, హ్యాపి ఎపి సాధనే లక్ష్యంగా అంతా పనిచేయాలని కోరారు. ప్రధాని మోడీ రాకతో శ్రీశైల క్షేత్రానికి మహర్దశ రాబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.