ఇజ్రాయెల్ హమాస్ హోరాహోరీగా యుద్ధం సాగించినా రెండువైపులా అపార నష్టమే జరిగింది. గాజాలో కొన్ని వేలమంది నిర్వాసితులు కాగా, వారికి ఎలాంటి మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుపడడం ప్రపంచ దేశాల్లో ఆ దేశం అప్రతిష్టను మూటగట్టుకుంది. ఎట్టకేలకు గాజా యుద్ధం పరిసమాప్తం ఆశాజనకమైన కాలంగా వేడుకలతో సామూహిక ఉపశమనం కలిగిస్తుంది. పెల్లుబికిన ఆనందం రక్తసిక్తమైన సంఘటనలను మసక జ్ఞాపకంగా మారుస్తుంది. కానీ కొందరు తిరిగి అలాంటి సంఘటనలను తిరిగి చూడాలనుకుంటుండడం ఉన్మాదమే. సమాజాలు ప్రశాంతమైన రోజుల వైపు సాగుతూ తమ శక్తియుక్తులను పునర్నిర్మాణం, ప్రణాళికల కల్పన, చక్కని భవిష్యత్‌కోసం కలలు కనడానికి బదులు అసలు ఘర్షణలకు దారితీసిన కారణాలను తరచు మరిచిపోతుంటారు. శాంతి ‘సూత్రం’ తెగిపోకూడదని కోరుకుంటున్నారు. అయినప్పటికీ పశ్చిమాసియాలో ఆనందం అనుభవించే కాలాలు బహుస్వల్పం. రాజనీతిజ్ఞులు ఎన్ని హామీలు గుప్పించినా ప్రజాసంక్షేమం దిగులుగానే సాగుతుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య బలవంతంగా ఒప్పందం కుదిర్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాలో రెండేళ్ల మారణకాండకు ఫుల్‌స్టాప్ పెట్టించగలిగినా, ట్రంప్‌తో సహితం ఏ దేశాధ్యక్షుడు ఈ రీజియన్ రక్తసిక్త స్వభావాన్ని ఇంకా మార్చలేకపోతున్నారు.
ప్రపంచం లోనే అత్యంత పాశవిక ఉగ్రవాద సంస్థల కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది ఇజ్రాయెల్ బందీలు స్వదేశానికి తిరిగి రావడం యుద్ధం ముగింపునకు సంకేతం కావచ్చు. కానీ తరువాతి కౌంట్‌డౌన్‌కు సిద్ధమవుతున్నట్టు సులభంగా గుర్తించవచ్చు. ట్రంప్ శాంతి మంత్రం కేవలం కాల్పుల విరమణపైనే దృష్టిపెట్టింది. ఇది అమెరికా, అరబ్ దేశాలు, ఐరోపా నాయకుల రాజకీయ నిర్ణయ సహకారంతోనే సాధ్యమైంది. హింసాత్మక, అణచివేత పాలననుంచి హమాస్‌ను దూరం చేయాలన్న పటిష్టమైన నిబద్ధత లేకుంటే పశ్చిమాసియా మళ్లీ సాయుధ సంఘర్షణను త్వరలో ఎదుర్కొనే దుర్భర పరిస్థితి ఏర్పడక తప్పదు. హమాస్ డిఎన్‌ఎ ఎల్లప్పుడు ఉగ్రవాదం, హింసలతో కలుషితమవుతూ ఉంటుంది. 2023 అక్టోబర్ 7 తరువాత రెండేళ్ల పాటు సాగిన యుద్ధం ద్వారా స్పష్టంగా తెలిసిందేమిటంటే గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లను అదుపులో ఉంచి నియంత్రించడానికి సాయుధీకరణ తప్ప వేరే మార్గం లేదని హమాస్‌కు తెలిసిన సత్యం. హమాస్‌ను నిరాయుధీకరణ చేసి, గాజాలో పాలనా కేంద్రాలనుంచి తొలగింప చేయాలన్న నిబంధన, చర్చించడానికి వీలులేని పరిస్థితులే ట్రంప్ శాంతి ప్రణాళిక విజయవంతానికి అత్యంత కీలకం. రానున్న రోజుల్లో యుద్ధ జ్వాలలు తగ్గుముఖం పట్టిపోయినా, హమాస్‌ను అధికార శక్తులనుంచి తొలగించడం, వారి సాయుధ సైనికులు సామాన్య పౌరులుగా మారిపోవడమే ట్రంప్ ప్రణాళికకు అసలు అగ్నిపరీక్ష.
గత రెండేళ్ల కాలం జరిగిన సంఘటనల బట్టి గతంలో కంటే ఇప్పుడు విస్తృత ప్రాంతీయ భద్రతా చట్టం తక్షణ అవసరం మరింత ఎక్కువగా ఉంది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా తిరిగి అవతరించే ప్రతిపాదన అపరిష్కృతంగా మిగిలిపోయినప్పటికీ, రెండు దేశాల ఉనికిని ఇజ్రాయెల్‌చే ఒప్పించగలరన్న నమ్మకం ఉగ్రవాద సంస్థలకు లేకపోయినప్పటికీ, ఇజ్రాయెల్, అరబ్ దేశాల పరస్పర ప్రయోజనాలే ప్రాధాన్యంగా తెరపైకి వచ్చాయి. పశ్చిమాసియాలో పూర్తిగా సాధారణ పరిస్థితి ఏర్పడుతుందా లేదా అన్న సందేహంతో ఇజ్రాయెల్ కొట్టుమిట్టాడుతోంది. పాలస్తీనా సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఇజ్రాయెల్‌తో అధికారికంగా దౌత్యసంబంధాలను ఏర్పర్చుకునేది లేదని సౌదీ అరేబియా సీనియర్ అధికార వర్గాలు బహిరంగంగా స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు పాలస్తీనియన్ సమస్యతో తమకు తాము దూరంగా ఉన్న సౌదీలు, రెండేళ్లుగా సాగిన రక్తపాతాన్ని విస్మరించలేదు. ట్రంప్, నెతన్యాహు వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఇజ్రాయెల్ బందీలను విడిపించడం లోను, యుద్ధాన్ని ముగింప చేయడం లోను తమ రాజకీయ వ్యూహంతో విజయం సాధించగలిగారు.
ఈ చర్య వీరిద్దరికీ రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలిగించింది. ఇజ్రాయెల్ బందీలు స్వదేశానికి తిరిగి రావడానికి ముందు కూడా రానున్న ఎన్నికలకు సంబంధించి నెతన్యాహు జనాదరణ పదిశాతం పాయింట్లు ఎక్కువగానే సాధించింది. ఇజ్రాయెల్‌లో ట్రంప్ పర్యటించిన తరువాత ఈ ఆదరణ మరింత పెరుగుతుందని భావించడంలో తప్పులేదు. ఇదే ప్రధాన రాజకీయ అజెండాగా ఇజ్రాయెల్ ఎన్నికల్లో చోటుచేసుకోవచ్చు. ఇప్పటివరకు నెతన్యాహుకు అండదండలు అందించడానికి ట్రంప్ దృఢంగా కట్టుబడి ఉన్నారు. తన పదవీకాలంలో ఆయనకు ఏదైనా ఎంతవరకైనా సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు అనుకున్న గడువుకు ముందే నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంది. యుద్ధం పరిసమాప్తి అయినా, దాదాపు 2000 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలైనా, నెతన్యాహును వ్యతిరేకిస్తున్న ఉదార మితవాద పార్టీ లు, రాజకీయ నిష్ణాతుల హెచ్చరికలు ఏమీ చేయలేకపోవచ్చు. నెతన్యాహు భాగస్వాములు చెప్పుకోదగిన సైద్ధాంతిక సానుకూలతను ప్రదర్శిస్తుండటం, నెతన్యాహు లెక్కలేనన్ని రాజకీయ పాచికల ఎత్తుగడలను వేయడానికి వీలు కల్పిస్తోంది. కానీ పశ్చిమాసియాలో ఎంత జాగ్రత్తగా సమతూక రాజకీయ చతురతను ప్రదర్శించినా, రాత్రికి రాత్రే తారుమారు కావచ్చని చరిత్ర చెబుతోంది. శాంతి పునరుద్ధరణ హామీ మళ్లీ సుదూర పేలుళ్ల ప్రతిధ్వనిగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు.