2047 నాటికి అభివృద్ధిలో భారత్‌ను ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచాలనే ‘వికసిత్ భారత్’ అంటూ నిత్యం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాం. ఇప్పటికే ఆర్థికంగా నాలుగో స్థానానికి చేరుకున్నామని, త్వరలో మూడో స్థానంకు చేరుకోబోతున్నామని భావిస్తున్నాం. అయితే కుల వివక్ష, ముఖ్యంగా అణగారిన ప్రజలపట్ల ఈసడింపు, వేధింపులకు మాత్రం అంతులేకుండా పోతున్నది. ఎంతమందిని మొక్కుబడిగా ఉన్నత పదవులకు తీసుకొచ్చినా, రాజ్యాంగపరంగా ఎన్ని రక్షణలు కల్పిస్తున్నా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు సైతం ఎటువంటి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందో హర్యానాలో సీనియర్ ఐపిఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య స్పష్టం చేస్తున్నది. అటువంటి సీనియర్ అధికారి ఆత్మహత్య చేసుకుంటే, వెంటనే ఎందుకు చేసుకున్నానో వివరించిన 8- పేజీల నోట్ లభించినా దాని ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తగు చర్యలు చేపట్టేందుకు రోజుల తరబడి ప్రభుత్వం సంశయిస్తూ ఉందంటే మన వ్యవస్థలో వివక్ష ఎంత లోతుగా పాతుకు పోయిందో వెల్లడవుతున్నది.
కేవలం పూరన్ కుమార్ భార్య అమ్నీత్ పి కుమార్ ఓ సీనియర్ ఐఎఎస్ అధికారిని కావడం, కీలక నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తగు చర్యలు తీసుకోవాలని సాహసంతో పట్టుబట్టడంతో కొంతవరకైనా ప్రభుత్వం కదిలి రావాల్సి వచ్చింది. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో ఓ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైతే 24 గంటల లోగా, ఆ రాష్ట్ర ఉన్నత పోలీసు అధికారులకన్నా ముందుగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మజుందార్ అక్కడకు చేరుకొని, దర్యాప్తుపై ఆరాతీసారు. కానీ, పూరన్ కుమార్ విషయంలో జాతీయ ఎస్‌టి కమిషన్ వారం రోజులలోగా ఓ నివేదిక పంపమని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు లేఖలు రాసి ఊరుకుంది. హక్కుల సంఘాలు అధికార పక్షాల ప్రచార విభాగాలుగా ఏ విధంగా దిగజారుతున్నాయో ఇటువంటి ఘటనలు వెల్లడి చేస్తున్నాయి. సూసైడ్ నోట్ చూస్తే గత ఐదేళ్లుగా కేవలం కులం కారణంగా ఏ విధంగా వేధింపులు ఎదుర్కొంటున్నారో, మానసిక వ్యథకు గురిచేసారో వెల్లడవుతుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గాని, వ్యవస్థలు గాని జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయలేదంటే దేశంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అర్థం అవుతుంది.
‘ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం చాలా తీవ్రమైన అంశం. దాదాపు 14-15 మంది పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం చూస్తేనే కేసు తీవ్రత అర్థమవుతోంది’ అంటూ పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఆందోళన వ్యక్తం చేశారు. అయినా, ఎఫ్‌ఐఆర్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు అత్యున్నత స్థాయిలో జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. దళితులు, గిరిజనులకు రాజ్యాంగపరమైన ఉన్నత స్థానాలను కల్పిస్తున్నా, రాజ్యాంగం కల్పిస్తున్న అవకాశాల కారణంగా వారు ప్రభుత్వంలో ఉన్నత పదవులకు చేరుకుంటున్నప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని అనేక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. డా. బిఆర్ అంబేద్కర్ వంటి వారు అటువంటి వివక్ష, వేధింపులకు తిరగబడి పోరాటం చేసినా, అనేకమంది బలవుతూ వస్తున్నారు. దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నుండి, బిజెపి జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటువంటి వేధింపులకు గురయ్యారు. ఉన్నత పదవులు / స్థానాలు లభించినా స్వతంత్రంగా వ్యవహరింపలేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. చివరకు వారిని కలిసేందుకు ఎవ్వరైనా వస్తే కీలకమైన ప్రభుత్వంలోని పెద్దల అనుమతి తప్పనిసరి అవుతుంది.
రాజకీయంగా నాడు అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందిన ఇందిరా గాంధీ స్వయంగా ఎంపిక చేసి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఆధిపత్యం వహిస్తున్న పెత్తందారీ వర్గం ఆయనకు అడుగడుగునా అడ్డుతగిలింది. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఢిల్లీకి చేరవేసి అప్రతిష్ఠకు గురిచేసే విఫల ప్రయత్నం చేసింది. నాడు ఆయనను ఆ పదవి నుండి దించేవరకు విశ్రమించనని శపథం చేసి కాసు బ్రహ్మానందరెడ్డి విజయం పొందారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ పట్టుబట్టి జనరల్ సీటు అయిన కర్నూల్ నుండి లోక్‌సభ అభ్యర్థిగా నిలబెడితే కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రతిష్ఠగా తీసుకొని ఓడించారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసినా నిలదొక్కుకోనీయలేదు. అయితే పాలన సామర్థ్యంలో తెలుగు రాష్ట్రాలను పాలించిన ఏ ముఖ్యమంత్రికీ సంజీవయ్య తీసిపోరని అందరికీ తెలిసిందే. అదే విధంగా బంగారు లక్ష్మణ్‌ను బిజెపి అధ్యక్షునిగా నాటి ప్రధాని వాజపేయి ఎంపిక చేస్తే మిగిలిన వారు తట్టుకోలేకపోయారు. ఓ కుట్రపూరితంగా ఆయనపై అవినీతి మరక చల్లి పదవి నుండి తొలగించారు. ఈ మొత్తం వ్యవహారంపై తెహల్కాకు ఓ ప్రముఖ బిజెపి నేత ఆర్థిక సహాయం చేయడం గమనార్హం. రికార్డు చేసిన టేపులో రక్షణ శాఖలో తనకు ఎవ్వరో తెలియదని, ఎటువంటి పనులు చేయలేనని లక్ష్మణ్ స్పష్టంగా చెప్పినట్లు వినిపిస్తుంది.
ఇందులో కేసు ఏముందని ప్రశ్నించిన న్యాయమూర్తే ఆయనకు నాలుగేళ్లు శిక్ష విధించారు. అయితే, నాటి రక్షణ మంత్రి అధికార నివాసంలోనే రక్షణ ఒప్పందాల గురించి బేరాలు ఆడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జయ జైట్ల్ వంటి వారిని కనీసం అరెస్ట్ కూడా చేయకపోవడం గమనార్హం. జైలులో తగిన వైద్య సదుపాయం లేకపోవడంతో అనారోగ్యానికి గురైతే కనీసం ఆయనను గాని, ఆయన కుటుంబ సభ్యులను గాని పరామర్శించే ప్రయత్నం నాటి ప్రముఖ బిజెపి నాయకులు ఎవ్వరూ చేయలేదు. కేవలం నాటి పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మారు పేరుతో జైలుకు వెళ్లి పరామర్శించారు. కానీ అనారోగ్యంతో ఆయన మృతి చెందగానే హైదరాబాద్‌కు వచ్చిన అగ్రనేతలు ఆయనను ఓ మహోన్నత దళిత నేత అంటూ పొగడ్తలు కురిపించారు.
బిజెపి అధ్యక్షునిగా నితిన్ గడ్కరీ రెండోసారి కొనసాగితే తమ ఆటలు సాగవని భయంతో కొందరు ప్రముఖులు నాటి యుపిఎ ప్రభుత్వంతో చేతులు కలిపి, ఆదాయ పన్ను నోటీసులు ఆయన కంపెనీలకు ఇప్పిస్తే, వెంటనే ఓ ప్రముఖుడితో విచారణ జరిపించి ఆయనకు ‘క్లీన్ చిట్’ ఇప్పించారు. కానీ అటువంటి అండదండలు బంగారు లక్ష్మణ్‌కు ఎందుకు లభించలేదు?
గిరిజనుల అభ్యున్నతి కోసం జీవితం మొత్తం ఎన్నో పోరాటాలు చేసి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన శిబూ సొరేన్‌ను పివి నరసింహారావు ప్రభుత్వం కాపాడేందుకు రూ. 50 లక్షలు ఇస్తే, ఆ డబ్బు దాచుకోవాలని తెలియక అమాయకంగా బ్యాంకులో వేసుకొని జైలు శిక్ష అనుభవించారు. కానీ ఆరుగురు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారని నిర్దిష్టమైన సాక్ష్యాలతో మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్ పిటిషన్ దాఖలు చేస్తే, ఆయన చనిపోయి చాలాకాలమైనా ఇప్పటి వరకూ దానిపై విచారించే ప్రయత్నం చేయడం లేదు. దళితులు, గిరిజనులు అనగానే వారంతా రిజర్వేషన్ల ద్వారా వచ్చారని, ప్రతిభ లేనివారని, అవినీతిపరులని హేళనగా మాట్లాడటం అలవాటుగా మారింది. అయితే, దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల నాయకత్వంలో, ఆధిపత్యంలోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలలో సైతం వారే కీలక పదవులలో ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని దారుణమైన అవినీతి ప్రభుత్వాలలో ఒకటిగా భారత్ ఎందుకు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నది? అందుకు ఎవ్వరు బాధ్యులు?
ఉన్నత విద్యాసంస్థల్లో సైతం ఇటువంటి వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతున్నది. చివరకు మెస్‌లలో వారి పక్కన కూర్చొని భోజనం చేసేందుకు సైతం వెనకాడే ధోరణులను మనం చూడవచ్చు. అసలు కేంద్ర విద్యా సంస్థలలో, ప్రభుత్వ విభాగాలలో వారికోసం ఉద్దేశించిన సీట్లు, ఉద్యోగాలను ఉద్దేశపూర్వకంగా భర్తీ చేయకుండా వారి అవకాశాలను కుట్రపూరితంగా వమ్ముచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిద్ధాంతాల గురించి ఘనంగా మాట్లాడే ఓ నాయకుడు వాజపేయి ప్రభుత్వ హయాంలో రాజస్థాన్‌కు చెందిన ఒక ఎస్‌సి నేతను రాజ్యసభకు పంపితే, ఆయనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్‌ను ఆక్రమించుకొని, చివరకు పనివారుండే గదిలో ఉండేందుకు కూడా ఆ ఎంపికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని అప్పట్లో రవివార్ అనే ఆంగ్ల వారపత్రిక కవర్ పేజీ కథనంతో ప్రముఖంగా ప్రచురిస్తే బిజెపి సర్దుబాటు ప్రయత్నం చేసింది. ఆ విధంగా వేధించిన నేత ఆ తర్వాత రాజ్యసభకు కూడా వెళ్లారు.
అసలు కులం, మతాలను గుర్తింపమని చెప్పుకొనే వామపక్షాలతో ఇప్పటివరకు ఈ వర్గాలకు చెందిన వారికి నాయకత్వ స్థాయికి అవకాశం ఇచ్చారా? చివరకు పిడబ్ల్యుజిలో సైతం కెజి సత్యమూర్తి వంటి వారు ఈ విషయమై చర్చలు లేవనెత్తారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. పలు సందర్భాలలో వాస్తవం కావచ్చు. అనేక మంది దొంగ కుల సర్టిఫికెట్‌లతో ఈ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతూ, అత్యున్నత స్థానాలకు వెళ్లగలుగుతున్నారు కూడా. రిజర్వేషన్ ప్రయోజనాలు కేవలం అత్యంత అల్పమైన శాతం ప్రజలే పొందుతున్నారు. ఆ పేరుతో వారిపట్ల ద్వేషభావం పెంచుకోవడం నేరం కాగలదు. అసలు ఈ రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతున్నాయో ఇప్పటి వరకు సమీక్ష చేసి ప్రయత్నం, సాహసం ఎవ్వరూ చేయడం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు అడ్డువస్తున్నాయి. మరోవంక, ఈ వర్గాలకు చెందినవారు గ్రామాల నుండి అత్యున్నత స్థాయిల వరకు నిత్యం వేధింపులు, వివక్షలకు గురవుతున్నారు.
బలమైన చట్టాలు ఉన్నప్పటికీ, వెంటనే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి విషయంలోనే వెల్లడైతే ఇక సాధారణుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ వర్గాల ప్రజలు హింసకు, వివక్షకు గురైన సందర్భాలలో వెంటనే వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం లేదు. ప్రతిపక్షాలు సైతం ఓ రాజకీయ అవకాశంగా భావిస్తున్నాయి. కనీసం మీడియా వారిని స్వేచ్ఛగా అటువంటి ప్రదేశాలకు వెళ్లే అవకాశం పలు సందర్భాలలో ఉండటం లేదు. అటువంటి ప్రయత్నాలు చేసి పలువురు అరెస్టుకు గురైన సందర్భాలు సైతం ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లకు సైతం ఇటువంటి దారుణమైన పరిస్థితులు దేశంలో కొనసాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, వ్యవస్థలు అందుకు బాధ్యత వహించాల్సిన సంస్థలు కారణమని చెప్పాల్సిందే.
చలసాని నరేంద్ర
98495 69050