ఉస్మానియా యూనివర్శిటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 200 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రూ. 40 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయిన సందర్భంలో కూడా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కడతాం 2.70 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది, కనుక నిధులు విడుదల చేయమని కోరారు. అరవింద్ కేజ్రీవాల్ మూడు సార్లు పాఠశాలలు మూలంగానే ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానని అన్నారు. మంచిదే, యంగ్ ఇండియా పాఠశాలల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలగనడంలో తప్పులేదు! కలలు సాకారం కావడానికి ఉన్న పునాది ఏమిటి అనేదే అసలు ప్రశ్న? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఆలోచన తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రట బుర్ర వెంకటేశం బుర్రలోనుంచి వచ్చిన సమగ్ర పాఠశాల విధానం. ఇప్పటికే జిల్లా కేంద్రాల వరకు విస్తరించిన కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో లక్షల రూపాయల్లో ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ప్రత్యామ్నాయ ఆలోచన ఆయనచేసి ఉండవచ్చును,తప్పులేదు! పదేపదే పాలకులు ఈ పాఠశాలల గురించి మాట్లడడం వలన ప్రభుత్వ ప్రాధాన్యత చెప్పకనే చెప్పినట్లైంది.
28 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం కోసం 2024 ఏప్రియల్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వాటిస్థితి ఇప్పుడు ఏమిటి? ప్రభుత్వం చెబుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అసలు స్వరూపం ఏమిటి? ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల స్థలం, 2560 మంది విద్యార్థులు, 124 మంది ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు నిర్మించాలి. ఒక్కో పాఠశాల నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చొప్పున 200 పాఠశాలల నిర్మాణం కోసం రూ. 40 వేల కోట్లు నిధులు సమీకరించాలి. 5 వేల ఎకరాల స్థలం సేకరణ చేయాలి. 24,800 మంది ఉపాధ్యాయులను కొత్తగా రిక్రూట్‌మెంట్ చేసుకోవాలి. వేలకోట్ల రూపాయలతో తరగతి గదులు నిర్మించాలి. ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యమంత్రి కలమొత్తం సాకారం అయితే, రాష్ట్రంలో 5 లక్షలమంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలుతో నాణ్యమైన ఉచిత విద్య అందుతుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 27 లక్షల 69 వేల మంది విద్యార్థుల్లో మిగతా 22 లక్షల విద్యార్థుల భవితవ్యం ఏమవుతుంది? ఇక ఈ ఐదు లక్షల మంది విద్యార్థులు ఎక్కడనుండి వస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల లో నుండే కదా? అంటే ఉన్న బడుల నమోదును, ఉనికిని దెబ్బ తీసి, దివాలాతీయించడమే కదా! ఇక ఇప్పటికే రాష్ట్రంలో 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు సరాసరి ఎకరం స్థలం వేసుకున్నా 30 వేల ఎకరాల విలువైన భూములు, గత 20 ఏళ్ళుగా సర్వశిక్షా అభియాన్ నిర్మించిన 2 లక్షల కోట్ల విలువైన తరగతి గదులు, 2 లక్షల 7 వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు.
ఏటా వేతనాలకు రూ. 18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ బడుల మనుగడ, భవిష్యత్తు, ఉనికి ఏమిటి? ఇప్పటికే ప్రభుత్వ బడులకు ఇన్నివేల ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉండగా, మరో 5 వేల ఎకరాల పంట భూములు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల కోసం సేకరించడం అవసరమా? ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో పిల్లలు లేనిచోట బోధనా సిబ్బంది ఉండడం, పిల్లలు ఉన్న చోట మౌలిక సౌకర్యాలు, బోధనా సిబ్బంది లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో అసమతౌల్య నిర్వాహణ అనేది ఎంతో బోధనాశక్తిని వృథా చేస్తున్నది. కాలక్రమంలో అనేక ప్రభుత్వబడులు మూతపడి ఉండడం, మరికొన్ని మూత దశకు చేరుకోవడం చూస్తున్నాము. ఇట్లాంటి స్థితిలో ఇప్పటికే ఏడాదిన్నర కాలంలో రెండు విద్యా కమిషన్‌లను ప్రభుత్వం నియమించింది. మాజీ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి అధ్యక్షతన నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రం అంతా పర్యటించి, అనేకమంది విద్యారంగం ప్రముఖుల అభిప్రాయాలు సేకరించి ఒక నివేదిక ఇచ్చింది. ఉన్న ప్రభుత్వ బడుల స్థానంలో మండలానికి నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, బడులు లేని క్యాచ్‌మెంట్ ఏరియా నుండి ఉచిత రవాణా సౌకర్యం పాఠశాల వరకు కల్పించాలని, ఒక్కో మండలానికి రూ. 50 కోట్లు చొప్పున, ప్రతి ఏటా వంద మండలాలకు రూ. 5 వేల కోట్లు వెరసి ఆరు సంవత్సరాలలో 634 మండలాల్లో ప్రభుత్వ బడుల పూర్తి సంస్కరణకు రూ. 31,700 కోట్లు ఆర్థిక ప్రణాళిక కూడా ఇచ్చింది.
కానీ, ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క పైసా విద్యా సంస్కరణ కోసం కేటాయించలేదు. సరికదా! ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం వీటి గురించి ఎక్కడా మాట్లాడడం లేదు? అంటే, కమిషన్ సిఫార్సులు చెత్తబుట్టకు పరిమితం చేసినట్లే గదా? గత పదేళ్ళలో కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకోకుండా ఒక వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్ల్లను స్థాపించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల నమోదును దారుణంగా దెబ్బతీసింది. ఆయా రెసిడెన్సియల్ పాఠశాలలు దివాలా తీసిన ఇంజనీరింగ్ కళాశాలల్లో అద్దె భవనాల్లో కునారిల్లుతున్నాయి. ఇప్పటికీ వాటి ప్రణాళిక లోపం వలన ఆయా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు బయటపడడం, కొన్ని కూలిపోయిన సంఘటనలు వెలుగు చూశాయి. పదేళ్ళ తర్వాత కెసిఆర్ విద్యా ప్రణాళిక వల్ల విద్యా ప్రమాణాలు స్థాయి దేశంలో 31వ రాష్ట్రంగా తెలంగాణ స్థిరపడింది. పరోక్షంగా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఈ అనాలోచిత రెసిడెన్షియల్ వ్యవస్థ వలన మరింత దెబ్బతిని ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా పాఠశాలలు ఏర్పాటు చేసి ఒకటో తరగతికే రూ. రెండు లక్షల ఫీజులు ఏ విద్యా హక్కు చట్టం ప్రకారం వసూలు చేస్తున్నారో? చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు పాఠశాల వ్యవస్థ ఫీజులు నియంత్రణ గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడున్న అవసరాల స్థాయికి ప్రభుత్వ విద్యావ్యవస్థలో ప్రణాళిక రూపొందించాలి. అందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ వనరులు వాడుకోవడం, సద్వినియోగం దిశగా ఆలోచన చేయడం ప్రభుత్వం ముందు ఉన్న తక్షణ కర్తవ్యం.
సిఎం రేవంత్‌రెడ్డి ప్రపంచస్థాయి నాణ్యమైన ఉచిత విద్య ప్రజలకు అందచేయాలనే ఆలోచనకు రావడం చాలా గొప్ప విషయం, ఆశయం, ఆలోచన, ఆయన కల అభినందనీయమే! కానీ, కలను సాకారం చేయడంలోనే పాలకుల నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్క రోజులోనో, ఏడాదిలోనో నెరవేరే లక్ష్యం కాదు! సుదీర్ఘ ప్రణాళిక, చిత్తశుద్ధితో కూడిన కృషి, పట్టుదల అవసరం. ప్రభుత్వ ఆలోచనలు ఆచరణీయమైన ప్రణాళిక దిశగా తెలంగాణ విద్యా వ్యవస్థ మంచి సంస్కరణ దిశగా కొనసాగాలని ఆశిద్దాం.
ఎన్.తిర్మల్ 94418 64514