న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ౨-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి సిరీస్ కావడం విశేషం. 121 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 63/1 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు తిరిగి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే సాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ 76 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కిందటి స్కోరుకు సాయి 9 పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో షాయ్ హోప్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌తో సుదర్శన్ ఔటయ్యాడు.
ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, మరో సిక్సర్‌తో 13 పరుగులు చేసిన గిల్‌ను గ్రీవ్స్ వెనక్కి పంపాడు. ఇక ధ్రువ్ జురెల్ 6 (నాటౌట్) అండతో మిగిలిన లాంఛనాన్ని రాహుల్ పూర్తి చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 108 బంతుల్లో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 129 (నాటౌట్) శతకాలతో చెలరేగి పోయారు. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్ 248 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది.
కానీ, రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. షాయ్ హోప్, జాన్ క్యాంప్‌బెల్‌లు శతకాలతో కదం తొక్కారు. గ్రీవ్స్ కూడా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 8 వికెట్లను పడగొట్టాడు. దీంతో కుల్దీప్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవీంద్ర జడేజాకు ప్రతిష్ఠాత్మకమైన ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. ఇదిలావుంటే అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. తాజాగా ఢిల్లీలోనూ గెలిచి సిరీస్‌ను వైట్ వాష్ చేసింది.
అదరగొట్టిన గిల్
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సిరీస్‌పై తనదైన ముద్ర వేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా గిల్ సారథిగా సత్తా చాటాడు. అయితే ఇంగ్లండ్‌పై టీమిండియా సిరీస్‌ను సాధించలేక పోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 22తో సమమైంది. కెప్టెన్‌గా గిల్ జట్టును ముందుండి నడిపించినా సిరీస్ మాత్రం అందించలేక పోయాడు. కానీ విండీస్‌పై మాత్రం సక్సెస్ అయ్యాడు. రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియాను ముందుండి నడిపించాడు. సారథిగా గిల్ అద్భుతంగా రాణించాడు. బ్యాట్‌తోనే కాకుండా కీలక సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకుని జట్టు విజయాల్లో తనవంతు పాత్రను సమర్థంగా పోషించాడు. కెప్టెన్‌గా ఇప్పటి వరకు ఆడిన రెండు సిరీస్‌లలో కూడా శుభ్‌మన్ చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు విండీస్‌పై విజయం దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో సమన్వయంతో వ్యవహరిస్తూ గిల్ జట్టును నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువే.