మన తెలంగాణ / హైదరాబాద్ : పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెండర్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం సీడబ్ల్యూసీకి లే ఖ రాసింది. పోలవరం -బనకచర్ల లింక్ ప్రాజెక్టు పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నపటికీ ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం కొత్త టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా టెండర్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచర్ల టెండర్, సర్వే నిలిపివేయాలని వి జ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం – బనకచర్ల లింక్ ప్రా జెక్టును ఆమోదించవద్దని కోరింది. పోలవరం డీపీఆర్‌కు విరుద్ధంగా ఈ టెండర్ ఉందని తెలంగాణ ఆరోపించింది. కాగా ఇటీవలే ఈ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, సిఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి
సీఆర్ పాటిల్‌ను స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా తెలంగాణ అభ్యంతరాలు తెలిపామని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మేం ఆలమట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
దేవాదుల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలి
దేవాదుల ప్రాజెక్టు పురోగతిని సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడి, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి డి. సీతక్క , ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికైన ప్రతినిధులతో కలిసి జె. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (జెసిఆర్‌డిఎల్‌ఐఎస్) పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువు లోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అన్ని విధానపరమైన అడ్డంకులను తొలగించాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, ఉత్తర తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలలోని ప్రతి రైతుకు నీటిపారుదల ప్రయోజనాలు చేరేలా చూడాలని ఆయన నీటిపారుదల శాఖను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గంగారం గ్రామం సమీపంలోని గోదావరి నది నుండి 38.16 టిఎంసి నీటిని లిఫ్టు చేయడానికి రూపొందించబడిన దేవాదుల పథకం, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల ఎగువ, పాక్షిక శుష్క ప్రాంతాల్లో 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించబడిందని అధికారులు మంత్రికి తెలిపారు.
తాజా పురోగతి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు మొత్తం నీటిపారుదల సామర్థ్యం మొత్తం 5.56 లక్షల ఎకరాల్లో 3.17 లక్షల ఎకరాలు. భూగర్భజలాల ద్వారా సాగునీరు అందించే 58,028 ఎకరాలతో కలిపి, మొత్తం ఆయకట్టు సామర్థ్యం పూర్తయిన తర్వాత 6.14 లక్షల ఎకరాలకు చేరుకుంటుందన్నారు. సవరించిన ప్రాజెక్టు వ్యయం రూ. 18,500 కోట్లకు గాను రూ. 14,269.63 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ. 4,230 కోట్లు మిగిలి ఉన్నాయన్నారు. ఖర్చు చేసిన మొత్తం మొత్తంలో సివిల్ పనులకు రూ. 11,667.85 కోట్లు, భూసేకరణకు రూ. 1,343.06 కోట్లు, హైడ్రో-మెకానికల్, ఎలక్ట్రో-మెకానికల్ ఇన్‌స్టాలేషన్‌లకు రూ. 1,170.63 కోట్లు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. సమావేశంలో సమర్పించిన నివేదిక ప్రకారం ప్రణాళిక ప్రకారం 2,430.82 కిలోమీటర్లలో 1,663.10 కి.మీ. మట్టి తవ్వకం పూర్తయిందని, 702.62 కిలోమీటర్లలో 669.66 కి.మీ. పైపులైన్లు వేయబడ్డాయని తెలిపారు. ప్రణాళిక చేసిన 16,113 నిర్మాణాల్లో 8,510 పూర్తయ్యాయని, 1,202.14 కిలోమీటర్లలో 799.80 కి.మీ కాలువ లైనింగ్ పూర్తయిందన్నారు. 46 ట్యాంకులకుగాను 39, 21 పంప్ హౌస్‌లకు గాను 18 పనిచేస్తున్నాయన్నారు.
సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయండి : స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ములుగు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. అలాగే గోదావరి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తిచేయాలని కోరారు. ములుగు పెండింగ్ ప్రాజెక్ట్ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ములుగు పెండింగ్ ప్రాజెక్ట్ ల పనుల పురోగతి పై నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశించారు.
మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు : చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
తెలంగాణలో కేబినెట్ మంత్రుల మధ్య విభేదాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మంత్రుల మధ్య సమన్వయం ఉందని, ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంగళవారం సచివాయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన శాఖ, జిల్లా అభివృధి పనులపై ఫోకస్ పెట్టానని, ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని ప్రాసెస్ అంతా తానే దగ్గరుండి చూశానన్నారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నా హక్కులను వదులుకోబోమన్నారు. బనకచర్ల, ఆల్మట్టిపై మేము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నామని కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం ప్రభుత్వం కమిట్‌మెంట్‌తో పనిచేస్తోందన్నారు. కేసీఆర్ పదేళ్లలో చేసిందేమి లేదని కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా భారత దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంటలు పండాయని, త్వరలోనే మహారాష్ట్ర వెళ్లబోతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 25 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు.