మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను దాదా అలి యాస్ వివేక్ ఆయు ధాలు వీడారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మల్లోజుల వేణుగోపాల్ 60 మంది మావోయిస్టులతో పాటు పెద్ద ఎత్తున ఆయు ధ సామాగ్రితో మంగళవారం గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సాయుధ పోరాటంతో రాజ్యాధికారం సాధించడం సాధ్యం కాదని, ఆయుధాలు విడిచి ప్రజాస్వామ్య పద్ధ తుల్లో ఉద్యమించాలన్న అభిప్రాయంతో ఉన్న మల్లోజుల 44 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని వీడి ఎట్టకేలకు జన జీవన స్రవంతిలో కలిశారు. 1956 మే 10వ తేదీన జన్మించిన మల్లోజుల వేణుగోపాల్ బీకాం విద్యనభ్యసించారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా తలపై కేంద్ర ప్రభుత్వం రూ. ఆరు కోట్ల రివార్డును ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల వేణు 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిద్నాపూర్‌లో జరిగిన ఎన్ కౌంటర్లో హతమైన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీకి సొంత తమ్ముడు కావడం గమనా ర్హం. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటును స్వాగతిస్తున్నట్లు ఛత్తీస్ గఢ్ డిప్యూటి సిఎం విజయ్ వర్మ ధృవీకరించారు.
మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని హర్షిస్తున్నామన్నారు. నక్సలిజాన్ని అంతం చేయాలని బస్తర్ ప్రజలు నిర్ణయించుకున్నారని, ఏడాది క్రితం పొలిట్ బ్యూరోలో మహిళా సభ్యురాలు లొంగిపోయారని, ఇవాళ ఆమె భర్త లొంగి పోయారని తెలిపారు. జనజీవనస్రవంతిలో కలిసేవారందరినీ తాము స్వాగతిస్తామని ఆయనన్నారు. మావోయిస్టు పార్టీని విడిచిపెట్టిరానివారితో తమ భద్రతాబలగాలు సరైన రీతిలో స్పందిస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, ఇందుకోసం తాత్కాలికంగా ఆయుధాలను పక్కనబెడతామని పేర్కొంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తరఫున అభయ్ పేరుతో మీడియాకు గత నెలలో ఒక లేఖ విడుదలైంది. అయితే అభయ్ ప్రతిపాదనకు మావోయిస్టు అగ్రనేతలు, క్యాడర్ మద్దతు ఉందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. తాత్కాలికం గా ఆయుధాలు విడిచిపెడతామని, శాంతిచర్చలకు సిద్ధమని పేర్కొంటూ లేఖ విడుదల చేసిన నెలరోజుల్లో మల్లోజుల వేణుగోపాల్ 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31ని కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్‌గా పెట్టుకుంది.
ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ‘మల్లోజుల’ ఉద్యమ ప్రస్థానం
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల మధురమ్మ, వెంకటయ్యల కుమారుడైన మల్లోజుల వేణు 1981లో తాను ఎంచుకున్న సిద్దాంతం కోసం అడవి బాట పట్టి ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో మహదేవపూర్ పోలీసులు మల్లోజులను అరెస్టు చేయగా, 1983లో విడుదల కావడంతో తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్‌ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్ పదోన్నతి లభించింది. తన తండ్రి వెంకటయ్య గతంలో మరణించినా ఎన్ కౌంటర్‌లో తన సోదరుడు, మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్ జీకి హతమైనా, గతంలో మాతృమూర్తి మధురమ్మ మరణించినప్పటికీ మల్లోజుల వేణు వారెవరీ అంత్యక్రియలకు సైతం దూరంగా ఉన్నారు.
44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో అడవి బాట పట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఏనాడు ఆయన కన్న ఊరికి కాని, పుట్టిన ఊరికి కాని అడుగు పెట్టలేదు. ప్రస్తుతం ఆయన లొంగిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతోపాటు పెద్దపల్లి వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. మావోయిస్టు పార్టీలో ఏర్పడ్డ విభే దాలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పకడ్బందీ దాడులు నిర్వహిస్తుండడంతో మల్లోజుల లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఇటీవల ప్రచారం జోరందుకుంది. కాగా, ఆయన సతీమణి విమల చంద్ర సిద్ధం 2025 జనవరి 1న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు.