జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కొత్త మెలిక పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారు రెండో సారి పోటీ చేయరాదని, అధ్యక్ష పదవిని ఆశించే వారు పార్టీ లో ఐదేళ్ళ పాటు ఉండాలన్న మొదలైన నిబంధనలు విధించింది. మంగళవారం ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ ముఖ్య నేతలతో, జిల్లా పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలో ఉన్న పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా జూమ్‌లో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికకు ఆశావాహుల జాబితాను సిద్ధం చేసి అధిష్ఠానానికి అందజేసేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన ఇరవై రెండు మంది పరిశీలకులు కూడా ఈ జూమ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్,
మహేష్ కుమార్ గౌడ్ జూమ్‌లో మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జి కెసి వేణుగోపాల్ తాజాగా డిసిసి అధ్యక్షుల ఎన్నికకు కొన్ని నిబంధనలు పెట్టారని చెప్పారు. ఈ నిబంధనల ప్రకారం డిసిసి అధ్యక్ష పదవిని ఆశించే నాయకుడైనా, కార్యకర్త అయినా, ద్వితీయ శ్రేణి నాయకుడైనా ఐదేళ్ళ పాటు పార్టీలో ఉన్న వారే అర్హులని చెప్పారు. అంతేకాకుండా వారు పూర్తిగా క్రమశిక్షణ గల వారై ఉండాలని, ఎటువంటి వివాదాలు, కోర్టు కేసుల్లో ఉండరాదని సూచించారు.ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్న వారు రెండో సారి అంటే ఈ దఫా ఆశించరాదని, పోటీకి దిగరాదని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కొత్త వారికీ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిబంధనను పార్టీ అధిష్ఠానం తమకు చెప్పిందని వారు తెలిపారు.
బంధువర్గానికి నో-ఛాన్స్
ఇక పార్టీలో, ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న వారి బంధువులకూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అర్హులు కారని మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అటువంటి వారెవ్వరూ డిసిసి అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోరాదని తెలిపారు. బంధువులెవరైనా దరఖాస్తు చేసుకుంటే ఏఐసిసి పరిశీలకులు వారి పేర్లను తిరస్కరిస్తారని, అధిష్ఠానానికి అందజేసే ఆశావాహుల జాబితాలోనూ చేర్చడం జరగదని వారు ఖచ్చితంగా చెప్పారు.
మహిళలకు ప్రాధాన్యం
డిసిసి అధ్యక్షుల ఎన్నికకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సి ఉందని అన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి తమ పార్టీ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నదని వారు గుర్తు చేశారు. అదేవిధంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకూ డిసిసి అధ్యక్షుల ఎన్నిక విషయంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తామని వారు వివరించారు.
పైరవీలకు ఛాన్స్ లేదు..
ఏఐసిసి పరిశీలకుల వద్ద ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడరాదని, వారిని ప్రభావితం చేసే ప్రయత్నాలేవీ చేయరాదని మీనాక్షి, మహేష్ కుమార్ జిల్లా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆదేశించారు. ఏఐసిసి పరిశీలకులు కూడా ఎవరి ఇళ్ళకు వెళ్ళరాదని, పార్టీ నాయకులతో వ్యక్తిగతంగా సంభాషణలు చేయరాదని జిల్లా పార్టీ కార్యాలయాల్లో లేదా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఎవరితోనైనా మాట్లాడాలని, ఏదైనా పారదర్శకంగా ఉండాలని మీనాక్షి ఆదేశించారు.
వందకు తగ్గకుండా సంతకాలు..
ఓట్ చోరీపై ఏఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ఉ ద్యమాన్ని మహేష్‌కుమార్ ప్రస్తావిస్తూ ఓట్ చోరీపై ప్రతి గ్రామంలో వందకు తగ్గకుండా ప్రజల నుంచి సంతకాలు చేపట్టాలని పునరుద్ఘాటించారు. వారం, పది రోజుల్లో సం తకాల సేకరణ ముగించి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పం పిస్తే, తాము ఏఐసిసి కార్యాలయానికి పంపిస్తామని ఆయ న చెప్పారు. అగ్రనేత రాహుల్‌గాంధీకి మద్దతుగా దేశ వ్యా ప్తంగా సంతకాల ఉద్యమాన్ని పార్టీ చేపట్టిందని మహేష్ కుమార్‌గౌడ్ గుర్తు చేశారు. ఈ జూమ్ మీటింగ్‌లో గాం ధీభవన్ కాన్ఫరెన్స్ హాలులో కొంత మంది, జిల్లాల్లో పర్యటిస్తున్న ఏఐసిసి పరిశీలకులు తమకు కేటాయించిన జిల్లాల నుంచి, ఇంకా రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయాల నుంచి పాల్గొన్నారు.